Begin typing your search above and press return to search.
ఆకతాయిగా మెగా హీరో?
By: Tupaki Desk | 23 April 2016 3:41 PM GMTమెగాహీరోల్లో స్పీడంటే సాయిధరమ్ తేజ్ దే. వరసబెట్టి సినిమాల్ని ఒప్పేసుకొంటున్నాడాయన. త్వరలోనే సుప్రీమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ వెంటనే తిక్క కూడా విడుదలకి రెడీ అవుతుంది. ఆ తర్వాత చేయాల్సిన సినిమాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. బి.వి.ఎస్.రవి మొదలుకొని పలువురు దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పేశాడు సాయి. అయితే వాటిలో గోపీచంద్ మలినేని సినిమా మొదట పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రేపోమాపో ఆ సినిమాకి కొబ్బరికాయ కొట్టొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సినిమాకి ఆకతాయి అనే టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఆ చిత్రానికి... కథ రీత్యా ఆకతాయి అనే పేరైతేనే బాగుంటుందని చిత్రబృందం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది. సాయిధరమ్ తేజ్ కి చిరంజీవి పోలికలు వుండటం బాగా కలిసొస్తోంది. అందుకే దర్శకులంతా సాయిధరమ్ తేజ్ ని దృష్టిలో ఉంచుకొని కథలు సిద్ధం చేసుకొంటున్నారు. ఈ యేడాది ఆయన మూడు సినిమాలతో అలరించబోతున్నాడు. వచ్చే యేడాది ఆ సంఖ్య మరింత పెరగొచ్చని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. వీటిలో విజయాల శాతం ఎక్కువగా వుంటే మాత్రం ఇక సాయిధరమ్ తేజ్ స్టార్ లీగ్‌లోకి వెళ్లినట్టే!