Begin typing your search above and press return to search.

ఫ్రీగా చేశాడు.. పేరూ పోయింది

By:  Tupaki Desk   |   6 Aug 2017 6:43 AM GMT
ఫ్రీగా చేశాడు.. పేరూ పోయింది
X
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెద్ద మనసుతో చేసిన ఓ ప్రయత్నం అతడికి చేటు తెచ్చిపెట్టింది. ఈ శుక్రవారం రిలీజైన ‘నక్షత్రం’ తేజూకు పెద్ద పంచే ఇచ్చింది. కృష్ణవంశీ మీద గౌరవంతో ఉచితంగా ఈ సినిమా చేస్తే.. దాని వల్ల మంచి రాకపోగా చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో మాంచి ఊపు మీద ఉన్న సమయంలో కృష్ణవంశీ అడిగితే.. ఆయన మీద ఉన్న గౌరవంతో ‘నక్షత్రం’లో చిన్న క్యామియో రోల్ లాంటిది చేయడానికి అంగీకరించాడు తేజు.

ఐతే మొదట తేజు ఒప్పుకునే సమయానికి చిన్నగా ఉన్న పాత్ర కాస్తా.. అతను రంగంలోకి దిగాక పెద్దదైంది. తేజు క్రేజ్‌ను సినిమాకు వాడుకుందామని అనుకున్నాడో ఏమో.. దాన్ని మరింతగా పెంచాడట కృష్ణవంశీ. ఐతే ‘నక్షత్రం’ అనుకున్న సమయానికి పూర్తవలేదు. ఆలస్యమైంది. వారం రోజులు మాత్రమే ఈ సినిమాకు పని చేయాల్సిన తేజు.. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. బడ్జెట్ సమస్యల వల్ల ఈ సినిమాకు తేజు అసలు పారితోషకమే తీసుకోలేదు. అన్ని రోజులు ఉచితంగా పని చేశాడు.

డబ్బులు రాకున్నా ‘నక్షత్రం’ వల్ల పేరైనా వస్తుందేమో అనుకుంటే అదీ జరగలేదు. ఆల్రెడీ తిక్క.. విన్నర్ లాంటి డిజాస్టర్లతో వెనుకబడి ఉన్న సమయంలో ‘నక్షత్రం’ వచ్చి తేజును మరింతగా వెనక్కి లాగేసింది. ఈ సినిమాలో తేజు చేసింది అతిథి పాత్రే అయినప్పటికీ.. ఈ ఫ్లాప్‌ ను కూడా అతడి ఖాతాలో వేసి.. ‘హ్యాట్రిక్ ఫ్లాప్’ హీరోగా అతడికి కిరీటం పెట్టేస్తున్నారు జనాలు. మొత్తానికి ‘నక్షత్రం’ వల్ల అన్ని రకాలుగూ దెబ్బ తిని.. మళ్లీ ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్లు వస్తే చేతులెత్తే దండం పెట్టేసేలా ఉన్నాడు తేజు.