Begin typing your search above and press return to search.

రిస్క్‌ వద్దనుకున్న మెగా హీరో

By:  Tupaki Desk   |   27 Feb 2019 6:19 AM GMT
రిస్క్‌ వద్దనుకున్న మెగా హీరో
X
సాయి ధరమ్‌ తేజ్‌ కు ఈమద్య కాలంలో టైం అస్సలు బాగాలేనట్లుగా ఉంది. ఆయన ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తోంది. తేజ్‌ ఐ లవ్‌ యూ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న తేజూ తాజాగా 'చిత్రలహరి' చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న చిత్రలహరి చిత్రాన్ని ఏప్రిల్‌ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిత్రలహరి చిత్రంపై తేజూ చాలా ఆశలు పెట్టుకున్నాడు.

చిత్రలహరి చిత్రం పూర్తి అవ్వక ముందే తేజూ తదుపరి చిత్రం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదట తేజూ తమిళ సూపర్‌ హిట్‌ మూవీ 'రాక్షసన్‌' రీమేక్‌ చేయాలని ఆశ పడ్డాడు. అయితే ఆ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం అనుమానమే అంటూ కొందరు హెచ్చరించిన నేపథ్యంలో తేజూ ఆ మూవీని వదులుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌ మూవీ 'గల్లీ బాయ్‌' చిత్రం రీమేక్‌ ను తేజూ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని అది ఇప్పట్లో కార్యరూపం దాల్చే పరిస్థితి లేదు. అందుకే ప్రయోగాలు వద్దని, రిస్క్‌ లేకుండా మారుతి దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు.

మారుతి దర్శకత్వంలో వచ్చిన 'శైలజ రెడ్డి అల్లుడు' మూవీ ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. అయినా కూడా మారుతిపై యంగ్‌ హీరోల్లో నమ్మకం బాగానే ఉంది. అతడు మినిమం గ్యారెంటీ సినిమాలను అందిస్తాడని అంతా భావిస్తున్నారు. పైగా గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో బన్నీ వాసు నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో మూవీ అంటే ఖచ్చితంగా పాజిటివ్‌ బజ్‌ ఉంటుంది. అందుకే తేజూ రిస్క్‌ లేకుండా ఈ కాంబోకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. తేజూ 'చిత్రలహరి' చిత్రం విడుదలైన వెంటనే మారుతి మూవీని చేసే అవకాశం ఉంది.