Begin typing your search above and press return to search.

ఇప్పుడే చెప్పనంటున్న తేజూ

By:  Tupaki Desk   |   3 Jun 2018 3:30 PM GMT
ఇప్పుడే చెప్పనంటున్న తేజూ
X
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఆశలన్నీ ఇప్పుడు ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా మీదే ఉన్నాయి. వరుసగా ఐదు డిజాస్టర్ల తర్వాత తేజు నటిస్తున్న సినిమా ఇది. ‘తొలి ప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చు. దీని తర్వాత ఏ సినిమా చేయాలనే విషయంలో సాయిధరమ్ ఇంకా ఏమీ తేల్చుకోలేదని సమాచారం. ప్రస్తుతం అతడి దృష్టంతా ‘తేజ్ ఐ లవ్యూ’ మీదే ఉంది. దీని ఫలితాన్ని బట్టే తర్వాతి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేజు తన తర్వాతి సినిమా చేస్తాడని ఇంతకుముందు ప్రచారం జరిగింది. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా కూడా చేయాల్సి ఉంది. కానీ తన కెరీర్ కు కీలకమైన ‘తేజ్ ఐ లవ్యూ’ సంగతి తేలాకే వేరే సినిమా మీద దృష్టిపెట్టాలనుకుంటున్నాడతను. ఒకానొక టైంలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి సినిమాలతో మాంచి ఊపులో కనిపించాడు తేజు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమతయ్యాడు. ‘తిక్క’.. ‘విన్నర్’.. ‘నక్షత్రం’.. ‘జవాన్’.. ‘ఇంటిలిజెంట్’ లాంటి డిజాస్టర్లు అతడి కెరీర్ ను బాగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా ‘ఇంటిలిజెంట్’ తేజును అన్ని రకాలుగా డీలా పడిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో ‘తేజ్ ఐలవ్యూ’ అతడి కెరీర్ కు కీలకంగా మారింది. తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.