Begin typing your search above and press return to search.

మేనమామ పోలిక రాకుండా ఉంటుందా?

By:  Tupaki Desk   |   30 Nov 2017 4:23 AM GMT
మేనమామ పోలిక రాకుండా ఉంటుందా?
X
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని ఓ సామెతుంది. రక్త సంబంధీకుల్లోనూ మేనమామ దగ్గర కాస్త చేరిక ఎక్కువే ఉంటుంది. చిన్నతనంలో నాన్న తర్వాత హీరోలా కనిపించే వాళ్లలో మామయ్య కచ్చితంగా ఉంటాడు. అదే టాప్ హీరోలే మామయ్యలయితే.. వాళ్ల సినిమాలు.. డ్యాన్సులు.. ఫైట్లు చూస్తూ పెరిగితే పోలికలు రాకుండా ఎలా ఉంటాయి.. లక్షణాలు వంటపట్టకుండా ఇంకెలా ఉంటాయి? పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ ఎందుకు చేస్తారటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ ఇదే రిప్లయ్ ఇచ్చాడు.

తేజూ హీరోగా నటించిన జవాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ను ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా అభిమానులు వాట్సాప్ లో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ అభిమానులను ఆకట్టుకునే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేస్తారన్న మాటకు ‘‘చిన్నప్పటి నుంచి వాళ్లని చూస్తూ పెరిగాం. ఎంత కాదన్నా మా మేనమామ. యాక్షన్‌ సన్నివేశాలు - మూమెంట్లు కొన్ని అనుకోకుండా అలా వచ్చేస్తాయంతే’’ అంటూ బదులిచ్చాడు. మెగాస్టార్ సినిమాల్లోని హిట్ సాంగ్స్ రీమేక్ చేయడంపైనా తేజూ స్పందించాడు. ‘‘రీమిక్స్ సాంగ్స్ చేసిన తర్వాత చూసి బాగుందన్నారు కానీ, ఇలా చేస్తే బాగుండేది. అలా చేస్తే బాగుండేది.. అలా వద్దు.. ఇలా వద్దు.. అని ఎప్పుడూ చెప్పలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘‘‘జవాన్‌ అనగానే అంతా ఆర్మీలో పనిచేసే సైనికుడనే అనుకుంటారు. కానీ ప్రతి ఇంటిలో ఒక జవాన్‌ ఉంటాడు. ఒక విషయం కోసం పోరాడుతుంటాడు. మా ఇంటి వరకూ నేను జవాన్‌. ఈ సినిమా బాగా వచ్చింది. మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. మీ అంచనాలను కచ్చితంగా అందుకుంటుంది’’ అని తేజూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.