Begin typing your search above and press return to search.

అసలు కథ విన్నావా తేజు!

By:  Tupaki Desk   |   26 Jun 2018 7:08 AM GMT
అసలు కథ విన్నావా తేజు!
X
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం. చూడాలని ఉంది అనే సినిమాలో హీరోయిన్ అంజలా ఝవేరిని లైన్ లో పెట్టడం కోసం హీరో చిరంజీవి రైల్వే స్టేషన్ లో కనిపించి ఒకసారి కనిపించకుండా ఒకసారి మేజిక్ చేసి చివరికి తన పట్ల ఆకర్షితురాలు అయ్యేలా చేసుకుంటాడు. అలా ప్రేమ మొదలై పెళ్లి దాకా వెళ్తుంది. మనసంతా నువ్వే సినిమాలో సెకండ్ హీరోయిన్ తను రాయ్ తన బ్యాక్ గ్రౌండ్ చెప్పి బెదిరించి హీరో ఉదయ్ కిరణ్ ని 24 గంటలు తన మాట వినేలా చేసుకుని అడ్డమైన పనులు చేయించుకుంటుంది. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ పక్కన అతని ప్రేమకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాసులో వెంకటేష్ మ్యూజిక్ ట్రూప్ నడుపుతూ హీరోయిన్ ని ప్రేమలో పడేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో రెజీనాకు డూప్లికేట్ బాయ్ ఫ్రెండ్ గా నటించేందుకు ఓకే చెప్తాడు సాయి ధరమ్ తేజ్.

ఇన్నేసి పాత ఉదాహరణలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనుకుంటున్నారా. ఐదు డిజాస్టర్ల తర్వాత సాయి ధరమ్ తేజ్ ఓకే చేసిన దర్శకుడు కరుణాకరన్ కథలో ఇవే ఉన్నాయి కాబట్టి. నిన్న వచ్చిన ట్రైలర్ లోనే పైన చెప్పినవన్నీ బయటపెడితే రేపు అసలు సినిమాలో ఇంకెన్ని ఉంటాయో అని మెగా ఫాన్స్ కు సైతం అనుమానం వస్తోంది. అంత రొటీన్ గా కరుణాకరన్ కథ రాసుకున్నట్టు కనిపిస్తోంది. ఏ మాత్రం కొత్తదనం లేకుండా గతంలో ఎన్నో సార్లు చూసేసిన టెంప్లెట్ లోనే తేజ్ ఐ లవ్ యుని తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే ఎంత రిస్క్ వద్దనుకున్నా మరీ ఇంత రొటీన్ రూట్ లో వెళ్తారా అనే అనుమానం రాకమానదు. పైగా ఇలాంటి కథలో మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన తేజుని మరీ సాఫ్ట్ గా చూపిస్తే ఎంత వరకు మెచ్చుతారు అనేది కూడా అనుమానమే.

ఇవన్ని ఒక ఎత్తు అయితే లైఫ్ అండ్ డెత్ లాగా ఇది హిట్ అయ్యే తీరాలి అనే అవసరంతో ఈ సినిమాతో వస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇందులో ఏమంత నచ్చి ఓకే చేసాడో విడుదల అయ్యాక కానీ చెప్పలేం. అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్న రీతిలో ఇప్పుడు సినిమాల మీద అంచనాలు ట్రైలర్ ను బట్టే ఉంటున్నాయి. అలా చూసుకుంటే తేజ్ ఐ లవ్ యు వాటిని తగ్గించేలా ఉంది.ఎంత యూత్ ని టార్గెట్ చేసినా అన్ని ప్రేమ కథలు సక్సెస్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. లవ్ అని ఉన్నంత మాత్రాన ఏ సినిమాను యూత్ నెత్తిన పెట్టుకోలేదు. మెప్పించే కథా కథనాలు వినూత్నంగా అనిపించే ప్రెజెంటేషన్ చాలా అవసరం. మరి ఈ సూత్రాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్న తేజ్ ఐ లవ్ యు థియేటర్ లో ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో జూన్ 6న చూడాలి.