Begin typing your search above and press return to search.

ఇలాంటి ప్రొడ్యూసర్లు బతకాలి బాస్

By:  Tupaki Desk   |   15 Sep 2016 10:30 PM GMT
ఇలాంటి ప్రొడ్యూసర్లు బతకాలి బాస్
X
సినీ రంగంలోకి వచ్చే ప్రతి నిర్మాత లక్ష్యం అంతిమంగా నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే. ఆ మాటకొస్తే నిర్మాత అనే కాదు.. అందరి అంతిమ లక్ష్యం అదే అవుతుంది. ఐతే డబ్బుల సంగతలా వదిలేస్తే మంచి సినిమాలు తీయాలని.. తన సంస్థకు ఓ బ్రాండ్ నేమ్ ఉండాలని తపించే నిర్మాతలు చాలా కొద్దిమందే ఉంటారు. సాయి కొర్రపాటి ఆ కోవలోకే వస్తారు. తొలి ప్రయత్నంలోనే ‘ఈగ’ లాంటి సాహసోపేత చిత్రాన్ని తీసిన నిర్మాత ఆయన. ఆ సినిమా రాజమౌళి మీద నమ్మకంతో చేసి ఉండొచ్చు. దాని సంగతి వదిలేద్దాం.

ఆ తర్వాత తీసిన అందాల రాక్షసి.. దిక్కులు చూడకు రామయ్యా.. ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు ఆయన అభిరుచిని చాటి చెబుతాయి. ఈ కథల్ని.. కొత్త దర్శకుల్ని నమ్మి డబ్బులు పెట్టడానికి ముందుకు రావడం.. రాజీ పడకుండా సినిమాలను నిర్మించడం మాటల్లో చెప్పుకున్నంత చిన్న విషయం కాదు. ఈ క్రమంలో జయాపజయాల్ని పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగిపోయారు. హను రాఘవపూడి.. త్రికోఠి.. అవసరాల శ్రీనివాస్ లాంటి మంచి దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత సాయికే దక్కుతుంది.

గత నెలలోనే ‘మనమంతా’ లాంటి సినిమాను అందించాడు సాయి. విమర్శకుల ప్రశంసలు దక్కినా ఆ చిత్రానికి డబ్బులు రాకపోవడం విచారించాల్సిన విషయం. ఎక్కడ తప్పు జరిగిందో కానీ.. ఆ సినిమా ఆడాల్సినంత ఆడలేదు. అయినా సాయి నిరుత్సాహపడలేదు. ఇప్పుడు ‘జ్యో అచ్యుతానంద’ లాంటి మరో మంచి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈసారి ప్రశంసలతో పాటు కాసులూ కురుస్తున్నాయి. సినిమా మంచి విజయం దిశగా సాగిపోతోంది.

సాయి లాంటి అభిరుచి ఉన్న నిర్మాతకు ఓ మంచి విజయం దక్కినందుకు అందరూ సంతోషిస్తున్నారు. ఓ దర్శకుడికి ఎంత మంచి ఆలోచనైనా రావచ్చు. ఎంత వైవిధ్యమైన కథ అయినా తయారు చేయొచ్చు. చివరికి అది తెరమీదికి రావాలంటే దానిపై పెట్టుబడి పెట్టే నిర్మాత కావాలి. పరిశ్రమకే స్ఫూర్తినిస్తున్న సాయి నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని.. అవి కూడా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం.