Begin typing your search above and press return to search.

'సారంగధరియా' డాన్స్ కష్టాలు ఆ దేవుడికే తెలుసు: సాయిపల్లవి

By:  Tupaki Desk   |   20 Sep 2021 8:33 AM GMT
సారంగధరియా డాన్స్ కష్టాలు ఆ దేవుడికే తెలుసు: సాయిపల్లవి
X
టాలీవుడ్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయికలలో సాయిపల్లవి ఒకరు. ఆమెకి పారితోషికం కంటే పాత్ర ముఖ్యం, ఖర్చు కంటే కంటెంట్ ముఖ్యం. ఎంత పెద్ద బ్యానర్లోని సినిమా అయినా .. ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా పాత్ర తనకి నచ్చకపోతే సింపుల్ గా నో చెప్పేస్తుంది. తన సినిమాలో సిస్టర్ రోల్ చేయమంటే ఆమె ఒప్పుకోలేదని 'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చిరంజీవి చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'లవ్ స్టోరీ' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది.

ఈ నేపథ్యంలో సాయిపల్లవి మాట్లాడుతూ .. 'రౌడీ బేబీ' సాంగ్ కంటే నేను 'సారంగధరియా' పాటకి డాన్స్ చేయడానికి ఎక్కువగా కష్టపడ్డాను. ఈ పాటను నైట్ లో .. విపరీతమైన చలిలో చిత్రీకరించారు. చలికి కండరాలు పట్టేయడంతో డాన్స్ చేయడం చాలా కష్టమైపోయింది. ఆ బాధను పైకి కనిపించనీయకూడదు కనుక, అలాగే చేస్తూ వెళ్లాను. ఇక మరో పాటను రెయిన్ ఎఫెక్ట్ లో చేయవలసి వచ్చింది. పై నుంచి వర్షం .. నేలపై నీళ్లు .. కష్టమైన స్టెప్స్. జారుపడిపోతానేమోనని భయం. సాయిపల్లవి అనగానే డాన్స్ విషయంలో ఆడియన్స్ కి అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడానికి నేను మరింత కష్టపడవలసి వచ్చింది. ఈ రెండు పాటలకి కష్టపడినట్టుగా నేను ఇంతవరకూ ఏ డాన్స్ కి కూడా కష్టపడలేదు" అని చెప్పుకొచ్చింది.

ఇక నాగచైతన్య మాట్లాడుతూ .. " ఈ సినిమాలో ప్రేమ ఎంత ప్రధానమైనదో .. డాన్స్ కూడా అంతే ముఖ్యమైనది. సాయిపల్లవి కంటే సమస్య లేదు .. ఎందుకంటే ఆమె డాన్స్ దుమ్మురేపేస్తుంది. నేనేమో డాన్స్ లో చాలా వీక్. పైగా ఈ సినిమాలో నేను పోషించినది 'డాన్స్ మాస్టర్' పాత్ర. శేఖర్ కమ్ములగారు కథ చెప్పిన తరువాత, అంతా బాగానే ఉందండి .. కానీ హీరో ప్రొఫెషన్ మారిస్తే బాగుంటుందేమో అన్నాను. కానీ ఆయన ఎంత చెప్పినా వినలేదు. దాంతో నేను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడవలసి వచ్చింది. గంటల తరబడి ప్రాక్టీస్ చేసి ఎలాగో ఓకే అనిపించుకునేవాడిని. ఇంతవరకూ ఏ సినిమా కోసం కూడా నేను ఇంతగా కష్టపడలేదు" అని చెప్పుకొచ్చాడు. సెకండ్ వేవ్ తరువాత వస్తున్న ఈ సినిమా, థియేటర్లను ఏ స్థాయిలో దడదడలాడిస్తుందో చూడాలి మరి.