Begin typing your search above and press return to search.

మీ ఇంటి ఆడపిల్లలా ఆదరిస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Dec 2021 3:13 AM GMT
మీ ఇంటి ఆడపిల్లలా ఆదరిస్తున్నారు
X
తెలుగులో గ్లామర్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నప్పటికీ, సాయిపల్లవి పేరు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంతకుముందు హీరోల డాన్సుల గురించి మాత్రమే మాట్లాడుకునే ఫాన్స్, ఇప్పుడు ఆమె డాన్స్ గురించి కూడా చెప్పుకుంటున్నారు. అంతలా సాయిపల్లవి ఆడియన్స్ ను ప్రభావితం చేస్తోంది. గతంలో నానీతో కలిసి 'ఎం సి ఎ' సినిమాను చేసిన ఆమె, మళ్లీ ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేసింది. నిన్నరాత్రి వరంగల్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడింది.

"ఒక మూడు గంటలుగా నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్లంతా అప్పటి నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీకు ఇంత ఎనర్జీ ఎలా వస్తుందనేదే నాకు తెలియడం లేదు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ .. అభిమానం ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మీ ఆదరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇక 'శ్యామ్ సింగ రాయ్' గురించి చెప్పాలంటే ఇది ఒక విజువల్ ట్రీట్ గా ఉంటుంది మీ అందరికీ. ఈ సందర్భంగా ఒక ముగ్గురు గురించి మాత్రం నేను డెఫినెట్ గా మాట్లాడాలి. ఒకరు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు. శ్యామ్ సింగ రాయ్ - వాసు అనే రెండు ప్రపంచాలను ఆయన అద్భుతంగా చూపించారు.

ఇక సినిమాటోగ్రఫర్ సాను జాన్ ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా చూపించారు. కాస్ట్యూమ్స్ డిజైనర్ నీరజ కోన గారి పనితనం కూడా ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. మీరంతా థియేటర్స్ కి వెళ్లి చూస్తేనే, వాళ్లు పడిన కష్టానికి తగిన సంతృప్తి లభిస్తుంది. మీరంతా థియేటర్స్ కి వెళ్లి చూడాలనే నేను కోరుకుంటున్నాను. కోవిడ్ కి ముందు చేసిన ఈ సినిమాలను దాచిపెట్టింది .. మీరంతా థియేటర్స్ లో చూడాలనే. నాని గారి అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ఈ సినిమా ఇంత గొప్పగా రావాలంటే రైటర్ బాగా రాయాలి .. డైరెక్టర్ బాగా చేయాలి .. విజన్ బాగుండాలి. వీళ్లందరిపై నమ్మకం ఉంచి సపోర్ట్ చేసే నిర్మాత ఉండాలి. నిర్మాత వెంకట్ గారి గురించి మాట్లాడాలి. ఫస్టు నుంచి కూడా ఆయన నేను ఈ సినిమా చేయాలి .. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు అన్నట్టుగానే ఉన్నారు. ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనే నిర్ణయంతో అలాగే ఉన్నారు. అలాంటి ఒక మంచి నిర్మాతతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నేను వేరే ఒక స్టేట్ నుంచి వచ్చినా కూడా నన్ను మీ ఇంటి అమ్మాయిలానే చూస్తున్నారు. మీ అందరూ చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చింది.