Begin typing your search above and press return to search.

‘ఎంసీఏ’ను పొగుడుతున్నట్లా.. తిడుతున్నట్లా

By:  Tupaki Desk   |   27 Feb 2018 11:30 PM GMT
‘ఎంసీఏ’ను పొగుడుతున్నట్లా.. తిడుతున్నట్లా
X
కొందరు నటీనటులు ఏ పాత్రలు ఎంచుకున్నా.. ఏ సినిమాలు ఒప్పుకున్నా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ తరం కథానాయికల్లో ఆ తరహా గుర్తింపు సంపాదించిన వాళ్లలో సాయిపల్లవి పేరు ముందుగా చెప్పుకోవాలి. మలయాళంలో ఆమె చేసిన తొలి సినిమా ‘ప్రేమమ్’ ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె నటించిన ‘కాళి’ కూడా సాయిపల్లవి ఇమేజ్ ను మరింత పెంచింది. ఇక తెలుగులో ‘ఫిదా’తో ఆమెకు వచ్చిన గుర్తింపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి కథానాయిక ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ లాంటి రొటీన్ సినిమాలో మామూలు పాత్ర ఒప్పుకుంటుందని ఎవ్వరూ అనుకోరు.

‘ఎంసీఏ’ చూశాక చాలామందికి ఆశ్చర్యం కలిగించిన విషయం అందులో కథానాయికగా సాయిపల్లవి కనిపించడమే. మరి ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారని ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవిని అడిగితే.. డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘‘నేను కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయట్లేదని చాలామంది అడిగారు. ఒకసారి ట్రై చేసి చూద్దామనిపించింది. ‘ఎంసీఏ’ చేశాను. ఇప్పుడు నేను ఎలాంటి సినిమాలు చేయాలో నాకర్థమైంది. నేను ‘ఎంసీఏ’ చేయకపోతే కమర్షియల్ సినిమాలో చేస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచనలోనే ఉండిపోయేదాన్ని. నేను నటిగా ఎదిగాను. ‘ఎంసీఏ’ కూడా నాకు మంచి అనుభవమే’’ అని సాయిపల్లవి చెప్పింది. ఐతే ‘ఎంసీఏ’ చేశాక తాను ఎలాంటి సినిమాలు చేయాలో అర్థమైందని చెప్పడం ద్వారా.. ఇలాంటివి కాకుండా వెరైటీగా చేస్తేనే తనకు సూటవుతుందన్న విషయం చెప్పకనే చెప్పినట్లుంది సాయిపల్లవి. మొత్తానికి ఆమె వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ‘ఎంసీఏ’ను పొగిడిందా తిట్టిందా తెలియని సందిగ్ధత నెలకొంది.