Begin typing your search above and press return to search.

సాయి పల్లవి పట్టుదలను అభినందించాల్సిందే

By:  Tupaki Desk   |   4 Oct 2020 4:00 PM GMT
సాయి పల్లవి పట్టుదలను అభినందించాల్సిందే
X
హీరోయిన్‌ గా వరుస విజయాలు అందుకుంటున్న సమయంలో పారితోషికం డబుల్‌ చేసి వరుసగా నాలుగు అయిదు సినిమాలకు కమిట్‌ అయ్యే హీరోయిన్స్‌ ఎక్కువగా ఉన్న ఈ సమయంలో సాయి పల్లవి వంటి హీరోయిన్స్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. స్టార్‌ హీరోలు సైతం ఈమె డేట్ల కోసం వెయిట్‌ చేస్తారు అనడంలో సందేహం లేదు. అలాంటిది ఈమె మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తానంటూ పెద్ద సినిమాలను కూడా కాదంది. నటించేందుకు స్కోపు లేని సినిమాలను కోట్లు ఇచ్చినా చేయను అంటూ ముందే చెప్పేస్తోంది.

మొదట్లో ఇలా ఉన్నా ఆ తర్వాత తర్వాత పద్దతి మార్చకుంటారు. కాని ఈమె మాత్రం తన పద్దతి మార్చకోవడం లేదు. ఖచ్చితంగా తాను పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది. ఈ సమయంలో ఆమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేసేదుకు ఓకే చెప్పిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సాయి పల్లవి ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేసేందుకు కథకు ఓకే చెప్పిందట.

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్‌ లను దక్కించుకున్న అనీల్‌ రావిపూడి త్వరలో ఎఫ్‌ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత నాగచైతన్యతో మూవీ అంటూ వార్తలు వచ్చాయి. మరి ఆ సినిమాను మొదట చేస్తాడా లేదా సాయి పల్లవితో లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేస్తాడా అనేది చూడాలి. సాయి పల్లవి నటిగా గుర్తింపు దక్కించుకునే సినిమాలు చేయాలనే పట్టుదలపై నిలబడి అలాంటి పాత్రలే చేస్తుంది. అందుకు ఖచ్చితంగా ఆమెను అభినందించాల్సిందే.