Begin typing your search above and press return to search.

చిరంజీవిగారి మాట వినకపోతే చాలా నష్టపోయేవాడిని: సాయిచంద్

By:  Tupaki Desk   |   6 Oct 2021 5:30 AM GMT
చిరంజీవిగారి మాట వినకపోతే చాలా నష్టపోయేవాడిని: సాయిచంద్
X
ఒకప్పుడు ఉద్యమభరితమైన సినిమాలలో ఎక్కువగా నటించిన సాయిచంద్, ఆ తరువాత చాలాకాలం పాటు సినిమాలకి దూరంగా ఉండిపోయారు. కొంతకాలం క్రితం రీ ఎంట్రీ ఇచ్చిన ఆయనకు, 'ఫిదా' .. 'ఉప్పెన' వంటి సినిమాల్లో మంచి పాత్రలు పడ్డాయి. 'కొండ పొలం' సినిమాలోను ఆయన హీరోకి తండ్రి పాత్రలో నటించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. "నేను ఈ సినిమాలో నటించిన ఒక నటుడిగా ఈ ఫంక్షన్ కి రాలేదు. ఒక తండ్రిగా వచ్చాను. నా కొడుకు కోసం వచ్చాను .. నా కొడుకు గురించి మాట్లాడటానికి వచ్చాను.

నా కొడుకు ఎవరో మీకు తెలుసుగా .. 'ఉప్పెన'లో మీసం తిప్పాడే .. అతనే. నేను ఈ రోజున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవలసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవిగారు. 'సైరా' సినిమా చేస్తున్నప్పుడు నాతో చిరంజీవిగారు ఒక మాట అన్నారు. 'సాయిచంద్ .. నిన్న రాత్రి నేను ఒక కథ విన్నాను. వైష్ణవ్ ను ఆ సినిమాతో పరిచయం చేస్తున్నాము. అందులో ఒక పాత్ర ఉంది .. హీరోకి తండ్రి పాత్ర అది. ఆ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుందని నేను .. బుచ్చిబాబు అనుకున్నాము' అన్నారు. "సార్ .. 'ఫిదా'లో తండ్రి పాత్ర వేసి అందులో నుంచి ఇప్పటికీ బయటపడలేక చస్తున్నాను .. మళ్లీ తండ్రి పాత్రనా? అన్నాను నేను.

'లేదు .. లేదు .. ఇది చాలా అద్భుతమైన పాత్ర నువ్వు చేయి' అన్నారు. ఆ రోజున నేను చిరంజీవిగారి మాట వినకపోయి ఉంటే, నేను ఒక మంచి కొడుకుని పోగొట్టుకుని ఉండేవాడిని. షూటింగుకు వచ్చిన ప్రతి రోజు వైష్ణవ్ నన్ను పలకరించేవాడు. ఆయన సంస్కారం చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. ఆ సంస్కారం ఆయన తల్లి నుంచి వచ్చింది .. ఆ ప్రొఫెషనలిజం మేనమామల నుంచి వచ్చింది. ఇలాంటి పిల్లలు ఈ జనరేషన్ లో ఉన్నారా? అని నేను చాలా సంతోషపడిపోయాను. నేను .. వైష్ణవ్ తేజ్ కలుసుకోవడానికి కారణమైన బుచ్చిబాబుగారికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాను.

ఒక రోజున క్రిష్ గారి నుంచి కాల్ వచ్చింది .. 'కొండ పొలం'లో చేయాలన్నారు. హీరో ఎవరంటే .. వైష్ణవ్ తేజ్ అన్నారు. నాది ఏ పాత్ర అని అడిగితే తండ్రి పాత్ర అన్నారు. హమ్మయ్య అనుకున్నాను .. మా ఇద్దరికీ ఒకటే కారవ్యాన్ ఇవ్వాలని చెప్పాను. అది కరోనా సమయం కావడం వలన, నా విషయంలో వైష్ణవ్ చాలా కేర్ తీసుకునేవాడు. అడవిలో షూటింగు కావడంతో, నేను ఏ రకంగానూ ఇబ్బంది పడకుండా చూసుకున్నాడు. ఇక ఈ సినిమా పరంగా చూసుకుంటే రకుల్ గురించి రెండు మాటలు చెప్పాలి. 'నర్తనశాల' సినిమాలో అర్జునుడిగా ఎన్టీఆర్ .. కోడలు శశిరేఖ పాత్రలో ఎల్. విజయలక్ష్మి వేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఆమెను ఎప్పుడూ 'కోడలుపిల్ల' అనే పిలిచేవారట. అలాగే నేను కూడా రకుల్ ను ఇకపై కోడలుపిల్ల అనే పిలుస్తాను" అని చెప్పుకొచ్చారు.