Begin typing your search above and press return to search.

రజనీకాంత్ ను చాలా హర్ట్ చేశాను

By:  Tupaki Desk   |   25 Dec 2021 11:30 PM
రజనీకాంత్ ను చాలా హర్ట్ చేశాను
X
తెలుగు సినిమాలకి సంబంధించి వాయిస్ పరంగా ఆకట్టుకున్న ఆర్టిస్టుల జాబితాలో ఎన్టీఆర్ .. ఎస్వీఆర్ .. జగ్గయ్య .. రంగనాథ్ ముందువరుసలో కనిపిస్తారు. ఆ తరువాత స్థానంలో సాయికుమార్ ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డబ్బింగ్ ఆర్టిస్టుగా సాయికుమార్ కి మంచి డిమాండు ఉండేది. అప్పట్లో తమిళం నుంచి తెలుగుకి వచ్చిన రజనీ సినిమాలకి ఆయనే డబ్బింగ్ చెప్పేవారు. ఆయనే చెప్పాలనేది కూడా రజనీ మాటగా ఉండేది. అలాంటి సాయికుమార్ తాను హీరో అయిన తరువాత ఇతర హీరోలకు డబ్బింగ్ చెప్పడం మానేశారు.

తాజా ఇంటర్వ్యూలో సాయికుమార్ మాట్లాడుతూ .. "నేను 'పోలీస్ స్టోరీ' చేసిన తరువాత కొంతమంది పెద్ద వాళ్లంతా కలిసి, నీకున్నదే నీ వాయిస్. నువ్వు హీరో అయిన తరువాత ఆ వాయిస్ ను అందరికి ఇస్తే, ఇక్కడా నువ్వే వినబడి .. అక్కడా నువ్వే వినబడి మొనాటినీ వచ్చేస్తుంది" అన్నారు. వాళ్లు ఆ రోజున అలా చెప్పారు గానీ, అది తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే కొంతమందిని హర్ట్ చేశాను. ముఖ్యంగా సుమన్ .. రాజశేఖర్ ని. తెలియకుండా రజనీకాంత్ ను కూడా నేను హర్ట్ చేశాను.

రజనీకాంత్ గారికి నేను 'బాషా' మొదలైన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. వాళ్లంతా సూపర్ స్టార్స్ .. సాయి చెప్పనన్నాడు అంటే వాళ్లకి అనిపిస్తుంది గదా .. ఎందుకు చెప్పనంటున్నాడు అనీ. మొన్న లక్కీగా 'అన్నాత్తే' సినిమాకి కన్నడలో రజనీ పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పాను. కన్నడలో ఆయనకి నేను డబ్బింగ్ చెప్పడం ఫస్టు టైమ్. డబ్బింగు ఆర్టిస్టుగా నేను నా కెరియర్ ను 500 రూపాయలతో మొదలుపెట్టాను .. 25 వేల వరకూ తీసుకున్నాను. తరువాత డబ్బింగ్ అనేది లక్షల్లోకి వెళ్లిపోయింది.

డబ్బింగ్ ఆర్టిస్టులకు నంది అవార్డులను ఇవ్వాలనే అంశాన్ని అప్పట్లో గుమ్మడిగారి దృష్టికి తీసుకువెళ్లింది నేనే. ఆ తరువాత అందులో నేను లేను .. మా తమ్ముడు తొమ్మిదో పదో అవార్డులు కొట్టేశాడు. అయ్యో మనం మిస్సయ్యిపోయామే అనే ఫీలింగ్ ఉంటుంది. నేషనల్ అవార్డులను కూడా డబ్బింగ్ ఆర్టిస్టులకు ఇవ్వాలని నేను చెప్పాను. నేను డబ్బింగ్ చెప్పనన్నప్పుడు సుమన్ చాలా ఫీలై ఉంటాడు. తను చాలా సాఫ్ట్ కనుక ఏమీ అనలేదు. రాజశేఖర్ మాత్రం కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత రాజశేఖర్ 'ఎవడైతే నాకేంటి' చెప్పాను. ఇప్పుడు 'శేఖర్' సినిమాకి కూడా చెబుతున్నాను" అంటూ ముగించారు.