Begin typing your search above and press return to search.

ఏ నోట చూసినా సాయిపల్లవి మాటే!

By:  Tupaki Desk   |   21 Jun 2021 12:30 PM GMT
ఏ నోట చూసినా సాయిపల్లవి మాటే!
X
తెలుగు తెరపైకి చాలామంది హీరోయిన్లు వచ్చారు .. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను స్టార్ డమ్ ను సంపాదించుకున్నారు. కొంతమంది కథానాయికలు గ్లామర్ పరంగా నిలదొక్కుకుంటే, మరికొంతమంది నటన ప్రధానమైన పాత్రలతో రాణించారు. అయితే నటన ప్రధానమని సాగిన చాలామంది కథానాయికలు, తమ స్వభావానికి తగని పాత్రలను పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ రోజుల్లో స్కిన్ షో చేయకుండా రాణించడం కూడా కష్టమైన విషయమే.

చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతూ తాను ఎలాంటి పాత్రలకు సెట్ అవుతాను? ఎలాంటి పాత్రలలో మెప్పించగలను? అనే ఆలోచన చేయడం .. అలా ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ దిశగానే అడుగులు వేయడం కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. నేను ఫలానా కథలను మాత్రమే చేస్తాను .. నా పాత్ర పరిథి ఇలా ఉండాలి అనే ఒక విషయాన్ని కెరియర్ ఆరంభంలో చెప్పే సాహసం ఎవరూ చేయరు. కానీ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్న కథానాయికగా సాయిపల్లవి కనిపిస్తుంది.

సాయిపల్లవిని తొలిసారిగా తెరపై చూసినవారు గ్లామర్ పరంగా ఒక మోస్తరుగా ఉందని అనుకున్నారు. కానీ ఆమె నటన చూశాక అభిమానులుగా మారకుండా ఉండటం కష్టమని భావించారు. సాధారణంగా కథలో ఒక పాత్రగా హీరోయిన్లు అలరిస్తూ ఉంటారు. కానీ తన చేయిని అందించి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లే హీరోయిన్ గా సాయిపల్లవి కనిపిస్తుంది. చురుకుగా .. చలాకీగా ఉంటూ యూత్ ను .. పద్ధతిగా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం సాయిపల్లవి ప్రత్యేకతగా చెప్పొచ్చు. అందువల్లనే అందరూ ఇప్పుడు ఈ అమ్మాయిని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక వరుసగా రానున్న ఆమె సినిమాలు చూడటానికి సిద్ధమైపోతున్నారు.