Begin typing your search above and press return to search.

రవితేజ హీరోయిన్ కు బాలీవుడ్లో బంపరాఫర్

By:  Tupaki Desk   |   23 Dec 2017 2:56 PM IST
రవితేజ హీరోయిన్ కు బాలీవుడ్లో బంపరాఫర్
X
శియా గౌతమ్ గుర్తుందా..? రవితేజ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘నేనింతే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ భామ. అంతకుముందు పూరి పరిచయం చేసిన హీరోయిన్ల లాగే ఈమె కూడా పెద్ద రేంజికి వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ‘నేనింతే’ ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు ఫలించలేదు. రవితేజ లాంటి స్టార్ హీరోకు హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత ‘వేదం’ సినిమాలో చిన్న పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది శియ. ఆ తర్వాత ‘ఏడు ప్రేమకథలు’ లాంటి చిన్నా చితకా సినిమాలేవో చేసి కనుమరుగైపోయింది ఈ భామ. శియను మన ఆడియన్స్ పూర్తిగా మరిచిపోయిన స్థితిలో ఆమెకు బాలీవుడ్లో ఒక బంపరాఫర్ తగలడం విశేషం.

రాజ్ కుమార్ హిరాని లాంటి లెజెండరీ డైరెక్టర్ తో పని చేసే అవకాశం ఇప్పుడు శియకు దక్కింది. హిరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంజయ్ దత్ బయోపిక్ లో శియ ఓ కీలక పాత్ర పోషిస్తోందట. ఆమె పాత్ర ఏంటన్నది స్పష్టత లేదు కానీ.. హిరాని సినిమాల్లో చిన్న పాత్రయినా పెద్ద అవకాశంగానే భావిస్తారు. ఆయన సినిమాల్లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం తన కెరీర్ ను కొత్త మలుపు తిప్పుతుందని శియ ఆశిస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ - రణబీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజైన రణబీర్ లుక్ చూస్తే.. సంజయ్ దత్ ను అతను దించేసినట్లే కనిపించాడు. తనకు ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ కథను హిరాని ఎలా చూపిస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశముంది.