Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ కు షాకిచ్చిన సజ్జనార్

By:  Tupaki Desk   |   9 Nov 2021 2:31 PM GMT
అల్లు అర్జున్ కు షాకిచ్చిన సజ్జనార్
X
డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ తన మార్క్ చూపించాడు. తను ఎండీగా ఉన్న ఆర్టీసీని కించపరిచేలా ప్రకటన చేసిన అల్లు అర్జున్ కు గట్టి షాక్ ఇచ్చాడు. టీఎస్ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం తెలిపారు.

టీవీల్లో, యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని.. రాపిడో చాలా వేగంగా.. సురక్షితంగా ఉంటుందని.. అదే సమయంలో మాసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ తాజాగా 'రాపిడో' బైక్ సర్వీసుల అడ్వటైజ్ మెంట్ లో చెప్పుకొచ్చారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం తెలిపారు. బాధ్యతల హీరో అల్లు అర్జున్ ఇలా ప్రజలకు ఆర్టీసీ గురించి తప్పుగా చెప్పడం సరికాదన్నారు.

ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.

సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ ఆర్టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం, ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరన్నారు. వాస్తవానికి మెరుగైన , పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటననలో యాక్టర్స్ నటించాలని సూచించారు.

టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉందని.. అందుకే నటుడికి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు పంపుతున్నామని చెప్పారు.