Begin typing your search above and press return to search.

తెలుగు తెరకు కొత్త అందం .. సాక్షి వైద్య!

By:  Tupaki Desk   |   28 Jun 2021 2:30 AM GMT
తెలుగు తెరకు కొత్త అందం .. సాక్షి వైద్య!
X
అందంగా ఉన్న అమ్మాయిలు .. ఆపై కాస్త చురుకుగా ఉండే అమ్మాయిలు మోడలింగ్ దిశగా మొదటి అడుగు వేస్తారు. మోడలింగులో ఉన్న అమ్మాయిలు గ్లామర్ ఫీల్డ్ కి ముందుగా కనెక్ట్ అవుతారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల దృష్టిలో వాళ్లు పడే అవకాశాలు ఎక్కువ. అందువలన ఒక యాడ్ లో మెరిసినా .. ఒక హోర్డింగ్ పై విరిసిన అమ్మాయిలకు సినిమాల నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. అందువలన వెండితెరకి పరిచయమైన హీరోయిన్స్ లో చాలామంది మోడలింగ్ నుంచి వచ్చినవారే ఉంటారు.

అలా మోడలింగ్ నుంచి మరో కథానాయికగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఆ సొగసుల శిల్పం పేరే 'సాక్షి వైద్య'. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన ఈ పిల్ల ప్రస్తుతం మోడలింగ్ లో సందడి చేస్తోంది. ఈ అమ్మాయిని చూసిన దర్శకుడు సురేందర్ రెడ్డి, తాను పట్టాలెక్కించిన 'ఏజెంట్' సినిమా కోసం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. అఖిల్ జోడీగా ఈ ముద్దుగుమ్మ మురిపించనుందని అంటున్నారు. నాజూకుదనానికి నమూనాగా కనిపిస్తున్న ఈ అమ్మాయి, కుర్రాళ్ల చూపులను తన కనురెప్పల మధ్యే కాల్చేస్తోంది.

ఆల్రెడీ తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడ లైన్లో చాలామంది హీరోయిన్లు రెడీగా ఉన్నారు. కరోనా కారణంగా వాళ్లు కాలు పెట్టడం కాస్త ఆలస్యమైంది గానీ, లేదంటే ఈ పాటికే చాలామంది కుర్రాళ్లు థియేటర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తుండేవాళ్లు. 'లైగర్' ద్వారా అనన్య పాండే .. 'రొమాంటిక్' ద్వారా 'కేతిక శర్మ' పడుచు మనసుల మధ్య దూకడానికి సిద్ధంగా ఉన్నారు. మరో వైపున మీనాక్షి చౌదరి కూడా వరుస సినిమాలను చక్కబెడుతూనే ఉంది. మరి పొగడపువ్వుల్లాంటి ఈ అమ్మాయిల పోటీని సాక్షి వైద్య ఎంతవరకూ తట్టుకుంటుందో చూడాలి.