Begin typing your search above and press return to search.

కన్నడిగుల డిమాండ్ ని 'సలార్' మేకర్స్ గౌరవిస్తారా..?

By:  Tupaki Desk   |   19 May 2022 2:30 PM GMT
కన్నడిగుల డిమాండ్ ని సలార్ మేకర్స్ గౌరవిస్తారా..?
X
తెలుగు సినిమాలకు కన్నడ సీమలో మంచి ఆదరణ ఉంటుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్స్ నటించిన చిత్రాలు శాండిల్ వుడ్ లో భారీ వసూళ్లను రాబడుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణాలతో సరిహద్దును పంచుకున్న కర్ణాటక ప్రాంతాల్లో మరియు బెంగుళూరులలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండటం దీనికి కారణంగా చెప్పవచ్చు.

టాలీవుడ్ ఫిలిం మేకర్స్ డైరెక్ట్ తెలుగు వెర్షన్ ను కర్ణాటకలో రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఒకవేళ కన్నడలోకి డబ్బింగ్ చేసినా.. తెలుగు వెర్సన్ ను ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తుంటారు. అందులో 5 శాతం లోపు థియేటర్లలో మాత్రమే కన్నడ వెర్షన్ ను ప్రదర్శిస్తుంటారు. దీనిపై కన్నడ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక 'కేజీఎఫ్' ప్రాంఛైజీతో శాండీల్ వుడ్ స్టామినా ఏంటో జాతీయ స్థాయిలో చాటిచెప్పడంతో.. కన్నడ అభిమానులు తమ భాషలో చిత్రీకరించని డబ్బింగ్ చిత్రాలకు దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇతర భాషల హీరోలు డబ్బింగ్ సినిమాలతో కాకుండా.. స్ట్రెయిట్ కన్నడ మూవీ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ''సలార్'' చిత్రాన్ని తెలుగుతో పాటుగా కన్నడలో ద్విభాషా చిత్రంగా రూపొందించాలని కన్నడిగులు కోరుకుంటున్నారు. 'KGF 2' సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ నిర్మాత విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

కన్నడ దర్శక నిర్మాతలు రూపొందిస్తున్న సినిమా కావడంతో 'సలార్' ను డబ్బింగ్ చేయకుండా.. నేరుగా తమ మాతృ భాషలోనే తీయాలని వారు కోరుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమాని కన్నడలో చిత్రీకరించకపోతే.. అక్కడి జనాలు ప్రభాస్‌ కు ఔట్ సైడర్ ట్యాగ్‌ ని ఇచ్చి అతన్ని ట్రోల్ చేసే అవకాశం ఉంది. మరి 'సలార్' మేకర్స్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటే ఇటీవల 'పుష్ప' 'RRR' 'రాదేశ్యామ్' సినిమాల విడుదల సందర్భంగా కన్నడిగులు సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. అలానే 'అంటే సుందరానికీ' సినిమాని కన్నడలో డబ్ చేయకపోవడం పై హీరో నాని వ్యాఖ్యలపై భగ్గుమన్నారు.

'కన్నడ ప్రజలు తెలుగును అర్థం చేసుకుంటారు. తెలుగు చిత్రాలను తెలుగులోనే చూసేందుకు వారు ఇష్టపడతారు. అందుకే కన్నడలో మా మూవీని డబ్ చేయడం లేదు' అని అన్నారు. నాని కామెంట్స్ పై కన్నడ భాషాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నాని ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకున్నారు.

''నిర్దిష్ట సందర్భంలో నేను సమాధానంగా చెప్పిన దానికి.. సోషల్ మీడియాలోకి వచ్చేసరికి అర్థాన్ని మార్చేశారు. తన అభిప్రాయాన్ని సరిగా చెప్ప్పలేకపోయుంటే క్షమించండి.. బౌండరీస్ దాటి కన్నడ సినిమా సాధించిన సక్సెస్‌ కు గర్వపడుతున్నాను'' అని పేర్కొన్న నాని వివాదం చెలరేగకుండా చూశారు. కన్నడ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్న నేపథ్యంలో.. తమ భాషకు తగిన ప్రాధాన్యం ఉండాలని అక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారని అర్థం అవుతోంది.