Begin typing your search above and press return to search.

బాలీవుడ్డోళ్లకు ఇప్పుడైనా బుద్ధొస్తుందా?

By:  Tupaki Desk   |   23 July 2015 5:31 PM GMT
బాలీవుడ్డోళ్లకు ఇప్పుడైనా బుద్ధొస్తుందా?
X
ఎప్పుడూ రొటీన్ సినిమాలేనా.. కొత్తగా ట్రై చేయొచ్చుగా అని అడిగితే సినిమా వాళ్లు భలే చిత్రమైన సమాధానాలిస్తారు. అలా చేస్తే జనాలు చూడరండీ.. హీరో ఫ్యాన్స్ ఒప్పుకోరండీ.. అని. ప్రయత్నమే చేయకుండా ముందే నింద ప్రేక్షకుల మీద వేసేస్తే ఇంకేం చెబుతాం. సల్మాన్ ఖాన్ తో సినిమాలు తీసే దర్శకులు, నిర్మాతల అభిప్రాయం కూడా ఇదే. సల్లూ భాయ్ ప్రయోగాలు చేస్తే జనాలు హర్షించరని.. అతణ్ని మామూలు క్యారెక్టర్లో చూపిస్తే అలాంటి సినిమాలు ఆడవని ఓ గుడ్డి నమ్మకంతో రొటీన్ మాస్ మసాలా సినిమాలే తీస్తూ వచ్చారు. ఓ పక్క అమీర్ ఖాన్ మంచి కథలతోనే ఇంతింతై అని ఎదుగుతుంటే సల్మాన్ మాత్రం చెత్త కథలు, చెత్త పాత్రలతోనే కాలం గడుపుతూ వచ్చాడు.

ఐతే సల్మాన్ విషయంలో బాలీవుడ్ జనాలు పెట్టుకున్న పిచ్చి నమ్మకాలు ఎంత తప్పో ‘భజరంగి భాయిజాన్’తో తెలిసొచ్చింది. మన రైటర్ విజయేంద్ర ప్రసాద్ సల్మాన్‌ను దృష్టిలో పెట్టుకుని రాశాడో లేదో కానీ.. అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న ఈ కథ సల్మాన్ కు భలేగా సూటయింది. సల్మాన్ కామన్ మ్యాన్ గా నటిస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాతో అర్థమైంది. ఎక్స్ ట్రాలేమీ లేకుండా అతడిచ్చిన పెర్ఫామెన్స్ ఫ్యాన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తోంది. హీరోయిజం అంటే భారీ ఫైట్లు, పంచ్ డైలాగులే కాదని.. హీరోను సామాన్యుడిగా చూపించి కూడా గొప్పగా హీరోయిజం పండించవచ్చని ‘భజరంగి భాయిజాన్’తో రుజువైంది. మొత్తానికి మన విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ వాళ్లకు మంచి పాఠమే చెప్పాడు. ఇకనైనా బాలీవుడ్ జనాలు సల్మాన్ విషయంలో తమ ఆలోచనలు మార్చుకోవాలి. ముతక ఆలోచనలు, కథలు పక్కనబెట్టేసి.. సల్మాన్ ను కొత్త తరహా కథల్లో చూపించే ప్రయత్నం చేయాలి.