Begin typing your search above and press return to search.

చివ‌రికి స్టంట్ మాస్ట‌ర్ల‌ను న‌మ్మ‌ని స్టార్ హీరో

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:16 AM GMT
చివ‌రికి స్టంట్ మాస్ట‌ర్ల‌ను న‌మ్మ‌ని స్టార్ హీరో
X
బాలీవుడ్ లో స‌న్నివేశం అమాంతం షాకిస్తోంది. అక్క‌డ ఖాన్ లు ఇప్పుడు సౌత్ ట్యాలెంట్ కోసం వెతుకుతున్నారు. ఇక్క‌డ ద‌ర్శ‌కుల‌ను పిలిచి మ‌రీ అవ‌కాశాలిస్తున్నారు. ఇది కేవ‌లం ద‌ర్శ‌కుల వ‌ర‌కే కాదు క‌థానాయిక‌ల‌కు కొరియోగ్రాఫ‌ర్లు సంగీత ద‌ర్శ‌కుల‌కు వ‌ర్తిస్తోంది. అంతేకాదు ఇప్పుడు సౌత్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ల‌కు కూడా బాలీవుడ్ లో అవ‌కాశాలు పెరిగాయి.

కేజీఎఫ్ చిత్రానికి అద్భుత‌మైన స్టంట్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్ర‌ముఖ ఫైట్ మాస్ట‌ర్ కోసం కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ చాలా కాలం వేచి చూడ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్ త‌దుప‌రి చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' కోసం అభిమానులు ఓపికగా ఎదురుచూస్తున్నారు. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి థియేట‌ర్ల‌లోకి రానుంది. అంతకుముందు బాలీవుడ్ లో తన 34 సంవత్సరాల గుర్తుగా ఆగస్టులో మూవీ ప్రకటన టీజర్ ను పంచుకున్నారు. సల్మాన్ రగ్గడ్ లుక్ అతని అభిమానులకు పిచ్చెక్కించింది. ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫర్హాద్ సామ్జీ విలే పార్లేలోని గోల్డెన్ టబాకో ఫ్యాక్టరీలో యాక్షన్ డ్రామా చివరి దశ షూటింగును ప్రారంభించారు. సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి స్టూడియోని వచ్చే రెండు నెలలకు బుక్ చేశారు.

స‌ల్మాన్ గత నెలలో స్టూడియోలో గాడ్ ఫాదర్ కోసం చిరంజీవితో కలిసి డ్యాన్స్ నంబర్ ను పూర్తి చేసార‌ని మూవీ సన్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ప్రొడక్షన్ డిజైన్ టీమ్ అదే వేదికపై ముంబై మురికివాడ సెట్ ను నిర్మించడానికి సమయాన్ని స‌ద్వినియోగం చేసుకుంద‌ట‌. పాట చిత్రీక‌ర‌ణ‌ పూర్తయిన వెంటనే సల్మాన్ యాక్షన్ షూట్ లోకి ప్రవేశించాడని తెలిసింది.

ముఖ్యంగా స్లమ్ షెడ్యూల్ ను చిత్రీకరించే యోచ‌న‌లో అవసరమైన సెట్‌ను అప్పటి నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా పర్యవేక్షణలో ఫిల్మ్ సిటీలో ఏప్రిల్ లో తయారు చేశారు. కానీ స‌ల్మాన్ తో సాజిద్ కి సృజనాత్మక విభేదాలు తలెత్తడంతో సెట్ ను తీసివేసి ఇప్పుడు ప్రస్తుత వేదిక వద్ద అదే విధమైన సెట్ ను నిర్మించార‌ని తెలిసింది.

అంతేకాదు.. సల్మాన్ తదుపరి యాక్షన్ సీక్వెన్స్ కోసం KGF యాక్షన్ డైరెక్టర్ ద్వయం అన్బుమణి - అరివుమణి ఆన్ బోర్డ్ లో ఉన్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. KGF రెండు విడతలలో ప్రదర్శించిన యాక్షన్ శైలిని సల్మాన్ పూర్తిగా ఆస్వాధించాడని అత‌డి స‌న్నిహిత‌ వ్యక్తి వెల్ల‌డించారు. దానికి తోడు 'రాధే: యువర్ మోస్ట్ వాంట్ భాయ్' స‌మ‌యంలోనూ కేజీఎఫ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ల‌తో గొప్ప సమీకరణాన్ని కొన‌సాగించారు స‌ల్మాన్. ఇక బాలీవుడ్ లో ప‌నిచేసే రెగ్యుల‌ర్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ల‌ను న‌మ్మ‌కుండా భాయ్ సౌత్ స్టార్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ల‌ను న‌మ్మ‌డం ఒక ర‌కంగా ఆశ్చ‌ర్యం క‌లిగించేదే.

అయితే భాయ్ నుంచి దీనికి స‌మాధానం కూడా ఉంది. మాస్ కి ఏది నచ్చుతుందో ముందు వరుసలో ఉన్న ప్రేక్షకుల కోసం ఎలాంటి స్టంట్ లను డిజైన్ చేయాలోఅర్థం చేసుకున్నందున కేజీఎఫ్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్లు తన తదుపరి చిత్రానికి సరిగ్గా సరిపోతార‌ని అతను భావించాడట‌. స‌ల్మాన్ న‌టిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రీకరణ అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఎడిటింగ్- VFX పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు పూజా హెగ్డే - వెంకటేష్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

స‌ల్మాన్ ఖాన్ పై డాక్యు సిరీస్

ఇదేగాక సల్మాన్ ఖాన్ డిసెంబర్ లో అత్యంత ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో ఒకదానితో తన అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. తన అభిమానులను ప్రత్యేక సందర్భాలలో ట్రీట్ చేయడంలో స‌ల్మాన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని అతను కొంతకాలంగా పని చేస్తున్న డాక్యు-సిరీస్ 'బియాండ్ ది స్టార్‌'ను విడుదల చేయనున్నారు.

డాక్యుమెంటరీలో స‌ల్మాన్ భాయ్ కెరీర్ లైఫ్ కి సంబంధించిన‌ ప్రయాణాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. ఇది సల్మాన్ ఆరాధకులు ఎప్పుడూ ఎదుర్కొన్న అన్ని ప్రశ్నలకు వ‌న్ స్టాప్ సొల్యూష‌న్ గా జ‌వాబులిస్తుంద‌ని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ కుటుంబం- స్నేహితులు - భాగ్యశ్రీ- దిశా పటానీ- సాజిద్ నడియాడ్ వాలా- డేవిడ్ ధావన్-, సంజయ్ లీలా భ‌న్సాలీ- సుభాష్ ఘాయ్ -సూరజ్ బర్జాత్యా వంటి ఇప్పటివరకు పనిచేసిన వ్యక్తులందరూ ఈ సిరీస్ లో కనిపిస్తారు. అదనంగా హిమేష్ రేషమియా -కమల్ ఖాన్ వంటి తారలు కూడా అతని గురించి సిరీస్ లో మాట్లాడతారని తెలిసింది.

బాలీవుడ్ లైఫ్ ప్రకారం.. ఈ డాక్యుమెంట్-సిరీస్ డిసెంబర్ 27న విడుదల కావలసి ఉంది. అయితే నిర్మాతల నుండి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.