Begin typing your search above and press return to search.

అమీర్ మాట: వాళ్లిద్దరూ స్టార్లు.. నేను వెయిటర్

By:  Tupaki Desk   |   5 July 2016 11:16 AM GMT
అమీర్ మాట: వాళ్లిద్దరూ స్టార్లు.. నేను వెయిటర్
X
ఇంతకుముందోసారి బాలీవుడ్ లో నేనే నెంబర్ వన్ అని తనకు తాను ప్రకటించుకున్నాడు షారుఖ్ ఖాన్. ఐతే నెంబర్ వన్ అనేవాడు తనకు తాను నెంబర్ వన్ అని చెప్పుకోడంటూ తనదైన శైలిలో ఓ చురక అంటించాడు అమీర్ ఖాన్. ఇప్పుడేమో షారుఖ్ తో పాటు సల్మాన్ ఖాన్ ను కూడా ఆకాశానికెత్తేస్తూ మాట్లాడాడు. వాళ్లిద్దరి ముందు తనను తాను తక్కువ చేసుకున్నాడు.

తన కొత్త సినిమా ‘దంగల్’ పోస్టర్ లాంచింగ్ సందర్భంగా అమీర్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సల్మాన్ ఈ గదిలోకి రాగానే స్టార్ వస్తున్నాడని మీరు భావిస్తారు. కానీ నేను వస్తే వెయిటర్ వస్తున్నాడని అనుకుంటారు. సల్మాన్ తో పాటు షారుఖ్ కూడా అంతే. వాళ్లిద్దరూ వస్తున్నారంటే స్టార్లు వస్తున్నారని అనుకుంటారు. వాళ్లిద్దరి స్థాయి నాకు లేదు. వాళ్లిద్దరూ నాకంటే పెద్ద స్టార్లు’’ అని అమీర్ వ్యాఖ్యానించాడు.

ఐతే వెయిటర్ అనే మాట అన్నాక అది వివాదాస్పదం అవుతుందేమో అని అమీర్ జాగ్రత్త పడ్డాడు. వెయిటర్ల అవమానించాలన్న ఉద్దేశం తనకు లేదని.. తాను సైలెంటుగా వస్తానని చెప్పడమే తన ఉద్దేశమని అమీర్ అన్నాడు. ఈ మధ్య సల్మాన్ ఖాన్.. దంగల్ సినిమాలో రెజ్లింగ్ ఫైట్లు చేశాక రేప్ అయిన మహిళ లాగా తన పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెయిటర్ల మీద వ్యాఖ్యలపై ఆ వివరణ ఇచ్చాడు అమీర్. మరోవైపు సల్మాన్ రేప్ వ్యాఖ్యలు దురదృష్టకరమని.. అలాంటి మాటలు మాట్లాడాల్సింది కాదని అమీర్ అభిప్రాయపడ్డాడు.