Begin typing your search above and press return to search.

సుశాంత్ ఫ్యాన్స్ శాప‌నార్థాలపై స‌ల్మాన్ రెస్పాన్స్

By:  Tupaki Desk   |   21 Jun 2020 4:15 AM GMT
సుశాంత్ ఫ్యాన్స్ శాప‌నార్థాలపై స‌ల్మాన్ రెస్పాన్స్
X
బాలీవుడ్ యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో క‌ల్లోలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఖాన్ లు.. క‌పూర్లపై సుశాంత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ తెలిసిందే. అగ్ర నిర్మాత‌ల మాఫియా నైజం.. నెప్టోయిజంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇందులో ముఖ్యంగా స‌ల్మాన్ ఖాన్ కుట్ర‌లు కుతంత్రాలు అంటూ బోలెడంత ప్ర‌చారం సాగిపోయింది. సామాజిక మాధ్య‌మాల్లో స‌ల్మాన్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య పేరుతో ర‌క‌ర‌కాల అంశాలు తెర‌పైకొచ్చాయి. బాలీవుడ్ లో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు కుట్ర‌లు స‌హా శ‌త్రుత్వం ఎలా ఉంటుందో ప్ర‌పంచానికి అర్థ‌మైంది.

ఇప్ప‌టికీ ప‌రిస్థితి స‌ద్ధుమ‌ణ‌గ‌లేదు. కరణ్ జోహార్ .. సల్మాన్.. ఏక్త‌.. ఆలియా.. క‌రీనా.. సోనాక్షి త‌దిత‌రుల‌పై విమర్శలు పెరుగుతున్నాయి. వీళ్లంద‌రి సోష‌ల్ మీడియాల్లో ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్స్ వైదొల‌గిపోయారు. అయితే ఈ ట్రోలింగ్ పై ఒక్కొక్క‌రూ ఒక్కోలా స్పందించారు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ రెస్పాండ్ అయ్యారు.

తన అభిమానులను సుశాంత్ అభిమానులు ఉపయోగించిన భాష గురించి కానీ.. శాపనార్థాల గురించి కానీ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స‌ల్మాన్ ట్విట్ట‌ర్ లో కోరాడు. ``ఎంతో అభిమానించే ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి. నా అభిమానులంతా సుశాంత్ కుటుంబం.. అతని అభిమానుల పక్షాన నిలబడాలి`` అని స‌ల్మాన్ కోరారు.

సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం స‌ల్మాన్ కుటుంబ రాజ‌కీయాల్ని ఎత్తి చూప‌డ‌మే గాక‌.. బాంద్రాలోని `బీయింగ్ హ్యూమన్` కార్యాల‌యం వ‌ద్ద పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీనికి స‌ల్మాన్ అభిమానులు ప్ర‌తిస్పందించినా కానీ ``వేడి త‌గ్గే వ‌ర‌కూ వేచి ఉండాల‌`ని స‌ల్మాన్ కోర‌డం వ‌ల్లనే ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది.