Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమా.. పిచ్చ కామెడీ

By:  Tupaki Desk   |   16 Jun 2018 4:49 AM GMT
సూపర్ స్టార్ సినిమా.. పిచ్చ కామెడీ
X
బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకడు. అతనెంత చెత్త సినిమా తీసినా ఈజీగా వంద కోట్ల వసూళ్లు వచ్చి పడిపోతాయి. మాస్‌ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండటంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్నిసార్లు అర్థం పర్థం లేని మసాలా సినిమాల్లో నటిస్తుంటాడు సల్మాన్. గత దశాబ్ద కాలంలో సల్మాన్ నుంచి అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఇప్పుడు రంజాన్ కానుకగా విడుదలైన ‘రేస్-3’ కూడా ఆ జాబితాలోనే చేరుతుందని అంటున్నారు విశ్లేషకులు.

సైఫ్ అలీ ఖాన్ హీరోగా దశాబ్దం కిందట వచ్చిన ‘రేస్’ అదిరిపోయే ట్విస్టులతో అలరించింది. సీనియర్ దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ ఆ చిత్రాన్ని రూపొందించారు. దానికి కొనసాగింపుగా సైఫ్ నే హీరోగా పెట్టి వాళ్లు తీసిన ‘రేస్-2’ సరిగా ఆడలేదు. అంతటితో వాళ్లు ఆ సిరీస్ ఆపేయాలనుకున్నారు. కానీ చిత్ర నిర్మాణ సంస్థ హీరోను.. దర్శకుల్ని పక్కన పెట్టేసి సల్మాన్ కథానాయకుడిగా రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్-3’ తీసింది. దీని ట్రైలర్ చూస్తేనే ఇందులో విషయం ఏమీ ఉండదనిపించింది.

ఇక సినిమా చూసిన జనాలందరూ దీని గురించి సోషల్ మీడియాలో పిచ్చ కామెడీ చేస్తున్నారు. రెండున్నర గంటల నిడివి ఉన్న రేస్-3లో రెండు గంటలు యాక్షన్ ఎపిసోడ్లే ఉన్నాయని.. సినిమాలో ఇంకేమీ లేదని పెదవి విరుస్తున్నారు విమర్శకులు. మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో సల్మాన్ శ్రుతి మించుతుంటాడు. ఐతే ఇందులో మరీ రాకెట్ లాంచర్ చేతులో పట్టుకుని విలన్ల మీదికి ప్రయోగించడంతో అది పెద్ద కామెడీ అయిపోయింది. దీని మీద బోలెడన్ని మీమ్స్ తయారైపోయాయి అప్పుడే. కథేమీ లేకుండా కేవలం పైపై హంగులతో సినిమా తీసి.. జనాల్లో తనకున్న క్రేజ్‌ ను క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నాడంటూ సల్మాన్ మీద పెద్ద ఎత్తునే విమర్శలు వస్తున్నాయి.