Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ బోల్తా కొట్టాడుగా..

By:  Tupaki Desk   |   1 Sep 2018 5:30 PM GMT
సల్మాన్ ఖాన్ బోల్తా కొట్టాడుగా..
X
ఇంతకుముందు అమెరికాలో ఇండియన్ సినిమాలు రిలీజ్ కావడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడది పెద్ద మార్కెట్ అయి కూర్చుంది. ఈ తరహాలోనే చైనా మార్కెట్‌ ను కూడా ఇండియన్ సినిమాలు కొల్లగొట్టడం మొదలైంది. అమీర్ ఖాన్ ‘త్రీ ఇడియట్స్’.. ‘పీకే’ సినిమాలతో నెమ్మదిగా పాగా వేశాడు. తర్వాత ‘దంగల్’తో విజృంభించాడు. ఈ సినిమా మరిన్ని బాలీవుడ్ సినిమాలకు గేట్లు తెరిచింది. గత ఏడాది కాలంలో చైనాలో చాలా హిందీ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ‘సీక్రెట్ సూపర్ స్టార్’.. ‘భజరంగి భాయిజాన్’.. ‘హిందీ మీడియం’ లాంటి చిత్రాలు వసూళ్ల మోత మోగించాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కూడా ఓ మోస్తరుగా ఆడింది. వీటి తర్వాత సల్మాన్ ఖాన్ సినిమా ‘సుల్తాన్’కు కూడా అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అంచనా వేశారు.

ఈ సినిమా రెజ్లింగ్ నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రీడ నేపథ్యంలోనే తెరకెక్కిన ‘దంగల్’ చాలా పెద్ద సక్సెస్ కావడం.. ‘భజరంగి భాయిజాన్’తో తనకూ మార్కెట్ రావడంతో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కానీ చైనాలో ఈ చిత్రం తుస్సుమనిపించింది. అంచనాల్ని అందుకోలేకపోయింది. ‘సుల్తాన్’ను ఈ శుక్రవారం చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేయగా.. తొలి రోజు మిలియన్ డాలర్లు కూడా వసూలు చేయలేకపోయింది. 9.4 లక్షల యుఎస్ డాలర్లు మాత్రమే రాబట్టింది. ‘భజరంగి భాయిజాన్’ అక్కడ తొలి రోజు 2.25 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. సినిమాను రిలీజ్ చేసిన స్థాయి ప్రకారం చూస్తే వసూళ్లు నామమాత్రం. అక్కడ వసూలైన మొత్తంలో 20 శాతం మాత్రమే షేర్ రూపంలో వెనక్కి వస్తుంది. ఆ లెక్కన చూస్తే ఈ వసూళ్లు ఎంత నామమాత్రమో అర్థం చేసుకోవచ్చు. తొలి రోజే ఓపెనింగ్స్ ఇలా ఉన్నాయంటే.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.