Begin typing your search above and press return to search.

కరోనా పై యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కండల వీరుడు

By:  Tupaki Desk   |   9 April 2020 9:10 AM GMT
కరోనా పై యుద్ధంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కండల వీరుడు
X
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్ అమలులో ఉంది. దీంతో చాలా మంది సినీ కార్మికులకు పనిలేకుండా పోయింది. మన టాలీవుడ్ లో సినీ కార్మికుల సహాయం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటి వరకు మన తెలుగు హీరోలు తమకు తోచిన విధంగా విరాళం అందిస్తూ వస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ ఏకంగా రూ. 25 కోట్లు విరాళం ఇచ్చి సంచలనం రేపాడు. మరోవైపు అజయ్ దేవ్‌ గణ్ - వరుణ్ ధావన్ - అమితాబ్ - హృతిక్ - విక్కీ కౌశల్ వంటి నటులు తమ వంతుగా సాయం చేసారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 25వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించిన సల్మాన్‌.. అందులో భాగంగా ఒక్కొక్కరి ఖాతాలో రూ.3000 జమ చేశారు. ఈ విషయాన్ని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు బీఎన్‌ తివారీ తెలిపారు.

బీఎన్‌ తివారీ మాట్లాడుతూ.. సినీ కార్మికుల బ్యాంకు ఖాతాలకు సల్మాన్ మొదటి విడతగా రూ.3 వేలు చొప్పున బదిలీ చేశారు. ఆర్థికంగా సతమతమౌతోన్న 23 వేల మది సినీ కార్మికుల జాబితాను ఆయనకు ఇచ్చాం. ఒకేసారి పూర్తి మొత్తం ఇస్తే అనవసరంగా ఖర్చు అవుతుందని భావించిన సల్మాన్.. పలు విడతల్లో వారికి సాయం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రతి సినీ కార్మికుడి ఖాతాకు రూ.3 వేలు పంపారు. కొన్ని రోజులు తరువాత మళ్లీ వారికి సల్మాన్ డబ్బులు బదిలీ చేస్తారు. పరిస్థితులు చక్కబడే వరకు సల్మాన్‌ వారికి సాయం చేయాలనుకుంటున్నారు అని తెలిపారు. సల్మాన్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్ ఫిల్మ్స్ సంస్థ 3 వేల మంది సినీ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున ఆర్ధిక సాయం అందజేసింది. వీళ్లతో పాటు రోహిత్ శెట్టి - బోనీ కపూర్ - అర్జున్ కపూర్ ఫిల్మ్ ఫెడరేషన్‌ కు విరాళాలు అందజేసారు. ఇక ప్రొడ్యూసర్ గిల్ట్ ఆప్ ఇండియా రూ. 1.5 కోట్లు సాయం చేసింది. మొత్తంగా చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన డబ్బులతో సినీ కార్మికులను ఆదుకుంటామని ఫెడరేషన్ అధ్యక్షుడు తివారీ చెప్పారు.