Begin typing your search above and press return to search.

నాగచైతన్య - అఖిల్ లను ఢీకొట్టడానికి రెడీ అయిన సమంత..!

By:  Tupaki Desk   |   5 April 2022 1:00 PM GMT
నాగచైతన్య - అఖిల్ లను ఢీకొట్టడానికి రెడీ అయిన సమంత..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ''యశోద". శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి - హరీష్‌ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ - ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌ లో తెరకెక్కుతోన్న 'యశోద' సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2022 ఆగస్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా వదిలారు.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తన మాజీ భర్త అక్కినేని నాగచైతన్య మరియు అతని సోదరుడు అఖిల్ చిత్రాలకు పోటీగా సమంత సినిమా విడుదల కాబోతోంది. చైతూ హిందీ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చద్దా' ను పలు వాయిదాల అనంతరం 2022 ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

అమీర్ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో కలిసి నాగచైతన్య నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అంటే చై మూవీ వచ్చిన ఒక రోజు తర్వాత సమంత నటించిన 'యశోద' మూవీ థియేటర్లోకి రాబోతోందన్నమాట.

ఇకపోతే అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ''ఏజెంట్''. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2022 ఆగస్ట్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు అదే రోజున సమంత సినిమా కోసం షెడ్యూల్ చేయబడింది.

దీంతో ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలతో సమంత ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయ్యే చిత్రాలే కావడం గమనార్హం.

ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్ జంట.. తమ ఏడేళ్ల ప్రేమకు నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే.గతేడాది అక్టోబర్ 2న వీరిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో పయనిస్తూ ఉన్నారు.

విడాకుల గురించి నాగచైతన్య - సమంత వివిధ సందర్భాల్లో స్పందించగా.. అక్కినేని ఫ్యామిలీ తరపున నాగార్జున మాట్లాడారు. అఖిల్ మాత్రం ఈ విషయం మీద ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఇప్పుడు చైతూ - సామ్ - అఖిల్ ముగ్గురూ బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టే పరిస్థితి రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఫైనల్ వార్ లో ఎవరు నిలబడతారో.. ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.