Begin typing your search above and press return to search.

ఈ బేబీ ఏడిపిస్తుంది కూడా..

By:  Tupaki Desk   |   8 Jun 2019 5:30 PM GMT
ఈ బేబీ ఏడిపిస్తుంది కూడా..
X
సమంత 'మజిలీ' చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకుని జోరు మీదుంది. మజిలీ చిత్రం కలెక్షన్స్‌ పరంగానే కాకుండా నటన పరంగా కూడా సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. మజిలీ చిత్రం తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చేసిన మూవీ 'ఓ బేబీ'. సినిమా పనులు జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలోనే సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం అంటూ ప్రకటించారు. సినిమా ఫస్ట్‌ లుక్‌ మరియు టీజర్‌ తో థీమ్‌ ఏంటో దర్శకురాలు నందిని రెడ్డి క్లారిటీ ఇచ్చేసింది. పూర్తి స్థాయి కామెడీ రోల్‌ చేయాలని నేను చాలా కాలంగా ఆశ పడుతున్నాను. అది దీంతో తీరిందని సమంత చెప్పిన నేపథ్యంలో సినిమాలో మస్త్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా సమంత ఈ చిత్రం గురించి స్పందిస్తూ కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎమోషన్‌ సీన్స్‌ కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది. కొన్ని ఎమోషన్‌ సీన్స్‌ గుండె బరువెక్కేలా చేస్తాయంటూ సమంత చెప్పుకొచ్చింది. తాత, అమ్మమ్మ, నానమ్మ లేకుండానే నా చిన్నతనం గడిచింది. అందుకే నందిని నన్ను వృద్దాశ్రమంకు తీసుకు వెళ్లింది. అక్కడ వారిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ప్రతి ఒక్కరిది ఒక కన్నీటి స్టోరీ. అయినా కూడా వారు అంతా కూడా చాలా నవ్వుకుంటూ ఒకరితో ఒకరు కలిసి పోయి జీవితంను గడుపుతున్నారు. ఆ ఎమోషన్‌ ను నేను షూట్‌ సమయంలో క్యారీ చేశాను. ఇంకా కూడా వారి గురించిన ఆలోచనలు నన్ను తొలుస్తున్నాయంది. ఓ బేబీ చిత్రం మొదటి రోజు వృద్దాశ్రమంలో ఉన్న వారితో చూడాలని ఫిక్స్‌ అయినట్లుగా సమంత చెప్పుకొచ్చింది.

జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఓ బేబీ' చిత్రంలో కీలక పాత్రలో లక్ష్మీ.. రావు రమేష్‌.. రాజేంద్ర ప్రసాద్‌ లు కనిపించబోతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లో రాబోతున్న ఈ చిత్రంపై సమంత చాలా చాలా నమ్మకంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. సమంతకు ఈ చిత్రం మరో సక్సెస్‌ ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.