Begin typing your search above and press return to search.

షాకింగ్: మైయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న సమంత..!

By:  Tupaki Desk   |   29 Oct 2022 11:00 AM GMT
షాకింగ్: మైయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న సమంత..!
X
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చుట్టూ గత కొంతకాలంగా అనేక రూమర్స్ వస్తున్నాయి. ఆమె ఉన్నట్టుండి షూటింగ్స్ బ్రేక్ ఇవ్వడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో సామ్ కు ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ట్రీట్ మెంట్ కోసం అమెరికా కు వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలన్నింటినీ క్లియర్ చేసింది.

సమంత శనివారం ట్విట్టర్ వేదికగా ఓ నోట్ షేర్ చేస్తూ తన అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. తను మైయోసిటిస్ (Myositis) అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వసిస్తున్నారని తెలిపిన సామ్.. ఈ సందర్భంగా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ట్రీట్ మెంట్ తీసుకుంటూనే డబ్బింగ్ చెప్తున్నట్లు కనిపిస్తోంది.

సమంత తన నోట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది. "యశోద ట్రైలర్‌ కి మీ స్పందన చాలా బాగుంది. మీ అందరితో నేను పంచుకునే ఈ ప్రేమ మరియు అనుబంధమే.. జీవితంలో నాకు ఎదురయ్యే అనంతమైన సవాళ్లను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది. కొన్ని నెలల క్రితం నుంచి నేను మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌ తో బాధపడుతున్నాను"

"ఇది ఉపశమనం పొందిన తర్వాత నేను దీన్ని అందరికీ షేర్ చేయాలని ఆశించాను. కానీ నేను ఆశించిన దానికంటే కొంచెం ఎక్కువ సమయం పడుతోంది. మనం ఎప్పుడూ బలమైన ముందంజ వేయాల్సిన అవసరం లేదని నేను నెమ్మదిగా గ్రహించాను. దీన్ని అంగీకరించడం నేను ఇంకా కష్టపడుతున్నాను. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వసిస్తున్నారు"

"నాకు మంచి రోజులు మరియు చెడు రోజులు ఉన్నాయి.... శారీరకంగా మరియు మానసికంగా.... నేను ఇంకో రోజుని భరించలేను అని అనిపించినప్పుడు కూడా, ఆ క్షణం ఎలాగో గడిచిపోతుంది. నేను కోలుకోవడానికి మరో రోజు దగ్గరగా ఉన్నానని మాత్రమే దీని అర్థం. ఐ లవ్ యూ.. ఇది కూడా గడిచిపోతుంది" అని సమంత పేర్కొంది.

మైయోసిటిస్ వ్యాధి బారిన పడిన వారికి కండరాలు వాపుకు గురవుతాయని తెలుస్తోంది. గాయాలైనా, ఇన్ఫెక్షన్లు వచ్చినా, రోగనిరోధక శక్తి క్షీణించినా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో కండరాలు బలహీనపడుతాయి. త్వరగా అలసిపోవడమే కాదు.. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడతారు.

ప్రస్తుతానికి మైయోసిటిస్ కు చికిత్స లేదని తెలుస్తోంది. అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి.. కండరాలను బలహీతను పురోగతి చెందకుండా నిరోధించడానికి చికిత్స చేస్తుంటారు. ఫిజికల్ థెరపీ, హీట్ థెరపీ, వ్యాయామంతో కూడా ఉపశమనం పొందవచ్చని తెలుస్తోంది. ఈ వ్యాధితో ఒక్కోసారి అంగవైకల్యం వచ్చి.. పరిస్థితి చేయిదాటితే ఏమైనా సంభవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

అలాంటి వ్యాధి ఇప్పుడు సమంతకు వచ్చినందుకు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.