Begin typing your search above and press return to search.

ఆయ‌న‌ వ్యాఖ్య‌ను ఖండిస్తే సామ్ కు చీవాట్లా?

By:  Tupaki Desk   |   7 July 2019 4:24 PM GMT
ఆయ‌న‌ వ్యాఖ్య‌ను ఖండిస్తే సామ్ కు చీవాట్లా?
X
ప‌బ్లిక్ వేదిక‌పై ఏదైనా మాట్లాడితే దానిపై అభిప్రాయం చెప్పే హ‌క్కు ఎవ‌రికైనా ఉంటుంది. అయితే ఆ ఒపీనియ‌న్ ఫ్యాన్స్ లో అపార్థానికి దారి తీస్తే ఇలానే తేడా కొడుతుంది. తామొక‌టి త‌లిస్తే నెటిజ‌నులు వేరొక‌టి త‌లిచిన చందంగా చీవాట్లు తినాల్సొస్తోంది. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో స‌ద‌రు నెటిజ‌నులు సైతం వాస్త‌వం ఏంటో చూడ‌కుండా గుడ్డిగా ట్రోల్స్ తో విరుచుకుప‌డితే ఏమ‌నాలి?

క‌బీర్ సింగ్ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ వ్యాఖ్య‌ను స‌రికాద‌ని ఖండించినందుకు అక్కినేని కోడ‌లు స‌మంత‌కు నెటిజ‌నుల నుంచి తీవ్ర‌మైన ట్రోల్స్ ఎదుర‌య్యాయి. స‌మంత‌తో పాటు రాగం క‌లిపినందుకు డ‌బ్బింగ్ క‌ళాకారిణి కం గాయ‌ని చిన్మ‌యికి చీవాట్లు త‌ప్ప‌లేదు. అస‌లింత‌కీ ఏమైంది? అంటే..

ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా క‌బీర్ సింగ్ లో హీరోయిన్ పై హీరో చెయ్యి చేసుకునే సన్నివేశాలపై వివాదాస్ప‌దంగా వ్యాఖ్యానించారు. ``ప్రేమలో ఉన్న ఇద్దరికి ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేనపుడు... వారిలో నిజమైన ప్రేమ లేనట్లే`` అంటూ సందీప్ చేసిన కామెంట్ పై స‌మంత సామాజిక మాధ్య‌మాల్లో త‌న అభిప్రాయం చెప్పారు. ఆ త‌ర్వాత కొద్ది సేప‌టికే చిన్మ‌యి సైతం ఆ వ్యాఖ్య‌పై వీడియోని రిలీజ్ చేయ‌డంతో వివాదం కాస్తా పీక్స్ కి చేరుకుంది. స‌మంత .. చిన్మ‌యి ఇద్ద‌రినీ ఒకే గాటిన క‌ట్టేసి సందీప్ రెడ్డి ఫ్యాన్స్ చీవాట్ల‌తో విరుచుకుప‌డ్డారు. సమంత డబల్ స్టాండర్డ్స్... రెండు నాల్కల ధోరణి.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేరకం!! అంటూ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ తో చెల‌రేగిపోయారు. 2017లో రిలీజైన అర్జున్ రెడ్డి గొప్ప సినిమా అంటూ కీర్తించిన స‌మంత ఇప్పుడిలా మాట్లాడ‌డం త‌గ‌దు అని సందీప్ రెడ్డి ఫ్యాన్స్ హిత‌వు ప‌లికారు. అయితే ఈ విమర్శలపైనా సమంత స్పందించారు. `ఒక సినిమా న‌చ్చ‌డం.. న‌చ్చ‌క‌పోవ‌డం వేరు.. ఒక‌రి వ్యాఖ్య న‌చ్చ‌లేదు అని విభేధించ‌డం వేరు. రెండిటినీ ఒకేలా చూడ‌కూడ‌దు! నాకు అర్జున్ రెడ్డి కథ బాగా నచ్చింది. ప్రేమించడం అంటే వారిని కొట్టే హక్కు కూడా ఉంది అని జనరలైజ్ చేయడం తగదు!!`` అని సామ్ స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేసినా సందీప్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం ట్రోల్స్ ఆప‌లేదు. అయితే ఇలా ఓపెన్ గా ఒపీనియ‌న్ చెబితే ట్రోల్స్ చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు? అన్న‌ది ఫ్యాన్స్ విజ్ఞ‌త‌కే వ‌దిలేయాలి.