Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సామాన్యుడు

By:  Tupaki Desk   |   4 Feb 2022 12:17 PM GMT
మూవీ రివ్యూ : సామాన్యుడు
X
చిత్రం : 'సామాన్యుడు'

నటీనటులు: విశాల్-డింపుల్ హయతి-బాబు రాజ్-యోగి బాబు తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: కవిన్ రాజ్
నిర్మాత: విశాల్
రచన-దర్శకత్వం: తు.పా.శరవణన్

కరోనా నేపథ్యంలో సినిమాల విడుదల బాగా తగ్గిపోయిన సమయంలో తెలుగువాడైన తమిళ నటుడు విశాల్ నటించిన అనువాద చిత్రం ‘సామాన్యుడు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తే మంచి యాక్షన్ థ్రిల్లర్ లాగా కనిపించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

పోరస్ (విశాల్) చదువు పూర్తి చేసుకుని పోలీస్ కావాలన్న లక్ష్యంతో ఉన్న కుర్రాడు. అన్యాయాన్ని చూస్తే అస్సలు సహించని అతణ్ని పోలీస్ కానిస్టేబుల్ అయిన తండ్రే ఆపుతుంటాడు. తన చెల్లిని ప్రేమ పేరుతో ఏడిపిస్తున్న కుర్రాడి విషయంలో కూడా తండ్రి కారణంగానే వెనక్కి తగ్గుతాడు పోరస్. ఐతే అనూహ్య పరిణామాల మధ్య పోరస్ చెల్లెలు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత పోరస్ చెల్లెలి స్నేహితుడు కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. తన చెల్లెల్ని చంపింది అతణ్ని ప్రేమ పేరుతో వేధిస్తున్న కుర్రాడే అనుకుంటాడు పోరస్. కానీ దీని వెనుక ఉన్నది వేరే వ్యక్తులని తర్వాత అర్థమవుతుంది. ఇంతకీ పోరస్ చెల్లెల్ని చంపిందెవరు.. అందుకు కారణమేంటి.. పోరస్ వాళ్ల పని ఎలా పట్టాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తెలుగు వాడైన తమిళ నటుడు విశాల్ మంచి పేరు సంపాదించింది.. తన కెరీర్లో ఎక్కువ విజయాలందుకున్నది యాక్షన్ టచ్ ఉన్న థ్రిల్లర్ సినిమాలతోనే. ‘అభిమన్యుడు’ సహా అతడి కెరీర్లో మంచి యాక్షన్ థ్రిల్లర్లున్నాయి. కథ పరంగా ఎంతో కొంత కొత్తదనం ఉండేలా చూసుకుని.. తన కటౌట్ కు తగ్గట్లుగా అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ పెట్టుకుని.. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు విశాల్. ‘సామాన్యుడు’ ట్రైలర్ చూస్తే ఇది ఆ కోవలోని సినిమాలాగే అనిపించింది. కానీ థియేటర్లోకి వెళ్లి కూర్చున్నాక కానీ తెలియదు.. ఇది పైన పటారం లోన లొటారం టైపు సినిమా అని. స్వయంగా విశాలే పీల్చి పిప్పి చేసేసిన కథల్నే అటు ఇటు మార్చి ఒక కథ తయారు చేసుకుని.. దానికి అనాసక్తికర కథనాన్ని జోడించి.. ప్రేక్షకుల మీదికి వదిలేశాడు దర్శకుడు తు.పా.శరవణన్. విషయం లేకుండా 2 గంటల 45 నిమిషాల పాటు సా.....గి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే అతి ‘సామాన్యమైన’ సినిమా ‘సామాన్యుడు’.

హీరో కుటుంబానికి ఏదో ఒక నష్టం జరిగితే.. ఆ నష్టానికి కారకులెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఒక్కో తీగ లాగుతూ వెళ్లడం.. చివరికి డొంక కదిలి విలన్ పని పట్టడం.. ఇదీ ‘సామాన్యుడు’ కథ. ఈ కోవలో వివిధ భాషల్లో చాలా సినిమాలే చూశాం. నాగశౌర్య సినిమా ‘అశ్వథ్థామ’ కూడా ఈ తరహా సినిమానే. ఐతే ఇలాంటి కథలను డీల్ చేయడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి కథను ఎంచుకున్నపుడు కచ్చితంగా ఎంతో కొంత కొత్తదనం ఆశిస్తాం. కానీ ‘సామాన్యుడు’లో ఆరంభం నుంచి చివరిదాకా కొత్తగా అనిపించే సన్నివేశం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. విశాల్ చాలా సినిమాల్లో మాదిరే ప్రథమార్ధంలో ఒక దశ వరకు లవ్.. ఫ్యామిలీ అంశాలను చూపించి.. ఇంటర్వెల్ దగ్గర సమస్యను హైలైట్ చేసి.. ద్వితీయార్ధమంతా హీరో-విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ను నడిపించారు. ఐతే ఇందులో మొదట్లో చూపించిన లవ్ స్టోరీతోనే నీరసం వచ్చేస్తుంది. హీరోయిన్ కు పెళ్లి చూపులు జరుగుతుంటే.. హీరో వచ్చి ఆమె గదిలోకి వెళ్లి గడియ పెట్టుకోవడం.. ఆ తర్వాత ఇంకో సీన్లో హీరోయిన్ తండ్రి సైలెంటుగా వచ్చి వాళ్ల పెళ్లికి ఓకే చెప్పేయడం.. ఇలాంటి సిల్లీ సీన్లతో నడిచే లవ్ స్టోరీ ఇది. ఇక హీరో కుటుంబ సన్నివేశాల్లోనూ పస లేదు. విపరీతమైన సాగతీతతో సాగే ప్రథమార్ధం చివరికి వచ్చేసరికే ప్రేక్షకుల పనైపోతుంది. హీరో చెల్లెలి కథకు తెరపడే ఇంటర్వెల్ పాయింట్లో సైతం ఉత్కంఠేమీ లేదు.

విలన్ని వెతుక్కుంటూ హీరో తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో ద్వితీయార్ధం మొదలవుతుంది. ఏదో చిన్న లింక్ పట్టుకుని హీరో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ విలన్ వరకు వెళ్లే క్రమాన్ని దాదాపు గంటకు పైగా నిడివితో చూపించాడు దర్శకుడు. అసలు ఉత్కంఠకు అవకాశమే లేని కథనంతో ఇంత సమయం సినిమాను నడిపించాలని దర్శకుడికి ఎలా అనిపించిందో? ఊరికే ఫైట్ల మీద ఫైట్లు వచ్చి పోతుంటాయి తప్ప కథాకథనాల్లో ఏ విషయం లేదు. విశాల్ వీరాభిమానులకు ఈ ఫైట్లు నచ్చుతాయేమో కానీ.. సామాన్య ప్రేక్షకులకు వీటిని భరించడం కష్టమే. క్లైమాక్స్ సైతం చాలా మామూలుగా అయిపోయి ఏముందీ సినిమాలో అన్న భావనతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటపడతారు. కథల ఎంపికలో మంచి టేస్టే ఉన్న విశాల్.. ఇలాంటి సినిమాను ఎలా ఓకే చేసి సొంత బేనర్లో నిర్మించడాన్నది అర్థం కాని విషయం.

నటీనటులు:

విశాల్ కు ఇలాంటి పాత్రలు ఎంతమాత్రం కొత్త కాదు. సామాన్యంగా కనిపిస్తూ విలన్ల మీద అసామాన్యంగా చెలరేగిపోయే క్యారెక్టర్లు అతను చాలా చేశాడు. ఎప్పట్లాగే అతను యాక్షన్ సన్నివేశాల్లో రాణించాడు. కొన్ని రియల్ స్టంట్స్ తో ఆశ్చర్యపరిచాడు. కానీ అంతకుమించి అతను కొత్తగా చేసిందేమీ లేదు. నటన పరంగా ఓకే. హీరోయిన్ డింపుల్ హయతి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆమెది నామమాత్రమైన పాత్ర. అలంకార ప్రాయంగా హీరోయిన్ ఉందంటే ఉంది అనిపించింది. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పరంగా అయినా హీరోయిన్లు హైలైట్ అవుతుంటారు. డింపుల్ కు ఆ అవకాశం కూడా రాలేదు. విలన్ గా చేసిన మలయాళ నటుడు బాబు రాజ్ కు తన ప్రతిభను చాటుకునే అవకాశమే రాలేదు. యోగిబాబు ఆరంభంలో కాసేపు కొన్ని పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను కూడా సైడైపోయాడు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘సామాన్యుడు’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం అతడి స్థాయికి తగ్గట్లు లేవు. అందుకు సినిమా స్కోప్ ఇవ్వలేదు. యాక్షన్ సన్నివేశాల వరకు బ్యాగ్రౌండ్ స్కోర్ తో యువన్ కాస్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఉన్న పాటలు ఒకటీ రెండు కూడా ఆకట్టుకునేలా లేవు. కవిన్ రాజ్ ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఒక కొత్త దర్శకుడి నుంచి రచనలో కానీ.. దర్శకత్వంలోని ఆశించే మెరుపులేవీ తు.పా.శరవణన్ చూపించలేకపోయాడు. అతను ఎంచుకున్న కథే పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. అతడి నరేషన్ కూడా ఏమంత గొప్పగా లేదు. దర్శకుడికి ఓవరాల్ గా పాస్ మార్కులు కూడా పడవు.

చివరగా: సామాన్యుడు.. అతి సామాన్యమైన సినిమా

రేటింగ్-2/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre