Begin typing your search above and press return to search.

చిరు కోసం ఆనందంగా టైటిల్ త్యాగం చేశాడు

By:  Tupaki Desk   |   6 Aug 2021 4:28 AM GMT
చిరు కోసం ఆనందంగా టైటిల్ త్యాగం చేశాడు
X
సినిమాకి టైటిల్ చాలా కీల‌క‌మైన‌ది. టైటిల్ తోనే స‌గం విజ‌యం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ భావిస్తారు. అందుకే టైటిల్ ఎంపిక విష‌య‌మై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో ఆచితూచి అడుగులేస్తారు. గ‌డిచిన‌ కొన్నేళ్లుగా తెలుగు సినిమాల టైటిల్స్ ఎంపిక ఆస‌క్తిని పెంచుతోంది. సూటిగా క్యాచీగా ఉండే టైటిళ్ల ఎంపిక‌తో ఆక‌ట్టుకుంటున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఒక టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు అంటే దానికి ఎంత‌టి ప్రాధాన్య‌త ఉంటుందో ఊహించ‌గ‌లం. ప్ర‌స్తుతం ఆయ‌న ఆచార్య త‌ర్వాత న‌టించే లూసీఫ‌ర్ రీమేక్ కోసం ఒక మంచి టైటిల్ కావాల‌ని వేచి చూస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇటీవ‌లే `గాడ్ ఫాద‌ర్` అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నార‌ని తెలిసింది.

అయితే ఈ టైటిల్ ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ `ర‌చ్చ` ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది వ‌ద్ద ఉంది. అత‌డు టైటిల్ ని ఇంత‌కుముందే ఫిలింఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించారు. మెగాస్టార్ మూవీ కోసం అదే టైటిల్ ని ఎంపిక చేయ‌డం యాథృచ్ఛికం. అయినా చ‌ర‌ణ్ గాడ్ స్వ‌యంగా త‌న‌కు గాడ్ ఫాద‌ర్ టైటిల్ కావాల‌ని సంప‌త్ నందిని సంప్ర‌దించార‌ట‌. త‌న ఫేవ‌రెట్ హీరో అడ‌గ్గానే మ‌రో ఆలోచ‌నే లేకుండా ఆ టైటిల్ ని సంప‌త్ నంది ఎంతో ఆనందంగా చిరు కోసం ఇచ్చారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ టైటిల్ ని రీమేక్ నిర్మాత‌లు ఎన్.వి.ప్ర‌సాద్-చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఇక సంప‌త్ నందికి మెగా ఫ్యామిలీ హీరోల‌తో చ‌క్క‌ని రిలేష‌న్ షిప్ ఉంది. రామ్ చ‌ర‌ణ్ తో ర‌చ్చ లాంటి మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కించిన సంప‌త్ నందికి ఆ త‌ర్వాత ప‌వ‌న్ తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ని తెర‌కెక్కించే అవ‌కాశం వ‌చ్చింది. కానీ సృజ‌నాత్మ‌క విభేధాల వ‌ల్ల సంప‌త్ ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోగా బాబి తెర‌కెక్కించారు. సంప‌త్ ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ కోసం మ‌రో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ ను ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

యువ‌హీరో స‌త్య‌దేవ్ కి చిరు అవ‌కాశం

లూసీఫ‌ర్ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఓ కీల‌క పాత్ర‌లో సత్యదేవ్ కనిపించనున్నారు. మాతృక‌లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా స‌త్య‌దేవ్ పేరును సూచించారు. సత్యతో చిరంజీవి భేటీకి సంబంధించిన స‌మాచారం ఇంత‌కుముందు రివీలైంది. ఈ సినిమాతో సత్యకు బిగ్ బ్రేక్ వ‌స్తుంద‌నడంలో సందేహ‌మేం లేదు. ఇక లూసీఫ‌ర్ మాతృక క‌థాంశం ప్ర‌కారం మోహ‌న్ లాల్ కి క‌థానాయిక ఎవ‌రూ ఉండ‌రు. అత‌డి పాత్ర ఆద్యంతం ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతుంది. తెలుగు వెర్ష‌న్ లో చిరు ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా మార్పు చేర్పులు చేస్తున్నారా? అన్న‌ది వేచి చూడాలి.