Begin typing your search above and press return to search.

గబ్బర్ సింగ్-2 టు బెంగాల్ టైగర్.. ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   8 Dec 2015 11:30 AM GMT
గబ్బర్ సింగ్-2 టు బెంగాల్ టైగర్.. ఏం జరిగింది?
X
సంపత్ నంది.. ఈ పేరు టాలీవుడ్ లో పెద్ద సంచలనం. ‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమాతో అరంగేట్రం చేసి.. వెంటనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ‘రచ్చ’ సినిమా అవకాశం దక్కించుకోవడం ఓ సెన్సేషన్ అయితే.. ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం మరో సెన్సేషన్. ఇవి చాలదన్నట్లు పవన్ కళ్యాణ్‌ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకోవడం.. ఆ తర్వాత అనూహ్యంగా ‘గబ్బర్ సింగ్-2’ నుంచి బయటికి వచ్చేయడం.. ఆ వచ్చేసిన కొన్ని రోజులకే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ మొదలుపెట్టడం.. ఇవన్నీ సంచలనాలే. ఐతే రెండేళ్లు ‘గబ్బర్ సింగ్-2’ కోసం పని చేసి బయటికి వచ్చేయడం గురించి సంపత్ ఎప్పుడూ మీడియాతో మాట్లాడింది లేదు. పవన్ తో ఎక్కడ తేడా వచ్చింది.. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది సంపత్ ఎప్పుడూ చెప్పలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ వ్యవహారం గురించి బ్రీఫ్ గా నాలుగు మాటలు మాట్లాడాడతను. అతనేమన్నాడో చూద్దాం పదండి.

‘‘నిజానికి రచ్చ తర్వాత పవన్ తో సినిమా చేయడానికి వేరే కథ తయారు చేసుకున్నా. ఐతే తర్వాత గబ్బర్ సింగ్-2 మీద పని చేద్దామని నిర్ణయించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారే కథ రాశారు. నేను స్క్రీన్ ప్లే - ట్రీట్ మెంట్ మీద పని చేశా. కానీ మా ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉండటంతో నేను బయటికి రావాల్సి వచ్చింది. ఐతే పవన్ తో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి. పవన్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఆయనతో చాలాసార్లు మాట్లాడాక మనిషిగా నాలో చాలా పరిణతి వచ్చింది. నా షాట్ మేకింగ్ స్కిల్స్ కూడా పెరిగాయి. రచ్చతో పోలిస్తే ‘బెంగాల్ టైగర్’లో ఆ మార్పు మీకు స్పష్టంగా తెలుస్తుంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారికి వేరే కథ వినిపిస్తాను’’ అని సంపత్ చెప్పాడు. ‘గబ్బర్ సింగ్-2’ నుంచి బయటికి వచ్చేసిన రెండు రోజులకే తనకు రవితేజ నుంచి కాల్ వచ్చిందని.. రచ్చ తర్వాత తయారు చేసిన ఓ కథను రవితేజకు వినిపించానని.. ఆయనకు వెంటనే నచ్చడంతో ‘బెంగాల్ టైగర్’ సెట్స్ మీదికి వెళ్లిందని సంపత్ చెప్పాడు.