Begin typing your search above and press return to search.

సంపూ.. చంపేశావ్ పో!

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:35 AM GMT
సంపూ.. చంపేశావ్ పో!
X
ఈ రోజు రాజమౌళి పుట్టిన రోజు. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడిపై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు సైతం జక్కన్నను పొగుడుతూ అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీడియా కూడా రాజమౌళి ఘనతల్ని గుర్తు చేస్తూ అతడిపై ఆర్టికల్స్ రాసి, శుభాకాంక్షలు అందజేసింది. ఐతే ఎవరెంత చేసినా.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు జక్కన్నకు విషెస్ చెప్పిన తీరు ముందు దిగదుడుపే. ట్విట్టర్ లో ఓ స్పెషల్ మెసేజ్ తో జక్కన్నకు శుభాకాంక్షలు చెప్పాడు బర్నింగ్ స్టార్.

‘‘శిఖరమంత నీ స్థాయిలో గ్రాము బరువంత లేని ఈ రేణువుని ఒక్క ట్వీట్ తో ప్రఖ్యాతి చేశావు’’ అంటూ మొదలుపెట్టి జక్కన్నకు బర్త్ డే విషెస్ చెప్పాడు సంపూ. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి.. సంపూ బాబుకి వచ్చిన ప్రఖ్యాతి ఏంటన్నది చాలా మందికి తెలియదు. మనోడు స్టార్ అయ్యిందే సోషల్ మీడియా ద్వారా. ఫేస్ బుక్ లో తనను తాను కీర్తించుకుంటూ, హదయ కాలేయం సినిమాకు సంబంధించి పోస్టర్లు, పాటలు పోస్ట్ చేస్తూ హంగామా చేసేవాడు సంపూ. ముందు అందరూ అతణ్నో జోకర్ లాగా చూశారు. ఐతే జక్కన్న ట్వీట్ చేశాక అతడి రేంజే మారిపోయింది. ఓ రోజు సంపూ ఫేస్ బుక్ పేజీ గురించి ట్వీట్ పెట్టాడు జక్కన్న. ‘‘ఎవరో సంపూర్ణేష్ బాబు అంట.. నన్ను భలే ఎంటర్ టైన్ చేశాడు. ఈ రోజు హాయిగా నవ్వుకున్నా’’ అంటూ అప్పట్లో ఓ ట్వీట్ పెట్టాడు జక్కన్న. అంతే ఎవడీ సంపూ అంటూ అందరూ అతణ్ని ఫాలో అవడం మొదలుపెట్టారు. సంపూ మీద అప్పటిదాకా ఉన్న అభిప్రాయం మారిపోయి.. అందరూ అతడి పోస్టుల్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అలా.. అలా.. తనకంటూ ఓ ఫాలోయింగ్ సంపాదించుకుని.. ‘హృదయ కాలేయం’ సినిమాతో జనాల దృష్టిని ఆకర్షించాడు సంపూ.