Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి డైరెక్టర్.. అడ్రస్ మార్చేశాడు

By:  Tupaki Desk   |   12 May 2018 5:35 AM GMT
అర్జున్ రెడ్డి డైరెక్టర్.. అడ్రస్ మార్చేశాడు
X
‘అర్జున్ రెడ్డి’ అనే ఒకే ఒక్క సినిమాతో సందీప్ రెడ్డి వంగా అనే పేరు మార్మోగిపోయింది. తెలుగు సినిమా నడతకు పూర్తి భిన్నంగా.. చాలా డేరింగ్ గా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను రూపొందించి.. అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు సందీప్. ఈ దర్శకుడు తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడు.. ఎవరితో తీస్తాడు అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ అతను మాత్రం టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ కు ఎగిరిపోవడానికి డిసైడయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఈ ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. హిందీ అర్జున్ రెడ్డి ఎవరనే విషయంలో సస్పెన్సుకు తెరపడింది. షాహిద్ కపూర్ హీరోగా ఫైనలైజ్ అయ్యారు. ఈ చిత్రానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది. ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి. దీంతో సందీప్.. హైదరాబాద్ నుంచి ముంబయికి మకాం మార్చేశాడు.

‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ను అధికారికంగా ప్రకటిస్తూ సందీప్ సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేశాడు. అందులో సందీప్ తో పాటు షాహిద్.. నిర్మాతలు అశ్విన్ వార్దె.. మురాద్ ఖేతాని ఉన్నారు. హిందీ వెర్షన్ కోసం సందీప్ ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. రీమేక్ మరింత హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. సినిమా మరింత బాగా ఉండే అవకాశముంది. ‘అర్జున్ రెడ్డి’కి నిర్మాత కూడా అయిన సందీప్.. హిందీ రీమేక్ హక్కుల్ని రూ.7 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ముందు ఈ డీల్ పూర్తయ్యాక సందీపే హిందీ వెర్షన్ కూడా డైరెక్ట్ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను రూపొందిస్తే.. ఇప్పుడు కేవలం రీమేక్ హక్కులతో రూ.7 కోట్లొచ్చాయి. ఈ చిత్రాన్ని తమిళంలో ‘వర్మ’ పేరుతో విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా బాలా దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ హక్కులు కూడా మంచి రేటుకే అమ్ముడైనట్లు సమాచారం.