Begin typing your search above and press return to search.

డెలివరీ త్వరగా కావాలని సానియా అలా చేసిందట

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:39 AM GMT
డెలివరీ త్వరగా కావాలని సానియా అలా చేసిందట
X
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జీవితంలో 2018ను ఏ మాత్రం మర్చిపోలేరు. ఆమెను అమ్మగా మార్చిన సంవత్సరం అదే మరి. బుల్లి మీర్జా ఇంట్లోకి అడుగుపెట్టిన ఏడాది కావటంతో పండుగ వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అప్పుడప్పుడు ఇజాన్ ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసే సానియా..తాజాగా రోమెడీ నౌ చానల్ లో ఒక షో చేస్తోంది.

ఆ షో పేరు.. ది లవ్ లాఫ్ లైవ్ షో. ఇందులో తన ప్రెగ్నెన్సీ గురించిన పలు ఆసక్తికర అంశాల్ని చెప్పనుందట. మరి.. ఆ ప్రోగ్రామ్ మీద అందరి అటెన్షన్ పడేలా చేయటానికి తాజాగా తన సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇంట్లో ఇజాన్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె.. తన ప్రెగ్నెన్సీ రోజుల గురించి వెల్లడించింది.

ఇజాన్ పుట్టే రెండు రోజులు ముందు వరకూ కూడా తాను టెన్నిస్ అడినట్లు చెప్పింది. నెలలు నిండిన తర్వాత టెన్నిస్ ఆడటం సాధ్యమేనా? అంటే.. అవునని చెప్పింది. ఇంతకీ ఆ పని ఎందుకు చేసిందో వివరిస్తూ.. కడుపులో తొమ్మిది నెలల బిడ్డను తాను మోయలేకపోయానని.. ఈ సందర్భంగా కాస్త అనారోగ్యానికి గురైనట్లు చెప్పింది. వీలైనంత త్వరగా బిడ్డను కడుపులో నుంచి బయటకు తెచ్చేందుకు టెన్నిస్ ఆడితే.. డెలివరీ ముందే అవుతుందని తాను భావించినట్లు చెప్పింది.

ఎలా అయినా బిడ్డను బయటకు తీసుకురావాలనుకున్నా. ఏం చేయాలో తోచలేదు. ఆ టెన్షన్.. భారం నుంచి బయటపడేందుకు డెలివరీకి రెండు రోజుల ముందు కూడా టెన్నిస్ ఆడా. అలా చేస్తే డెలివరీ ముందే అయిపోతుందని భావించా. కానీ.. అలా జరగలేదని చెప్పింది.

కాకుంటే.. టెన్నిస్ ఆడటం వల్ల మానసికంగా కాస్త ఉపశమనం పొందినట్లు చెప్పింది. టెన్నిస్ ఆడటం వల్ల త్వరగా డెలివరీ కాకుండా కాస్త ఒత్తిడి నుంచి మాత్రం బయటపడినట్లు చెప్పారు. తన తాజా పోస్ట్ తో శాంపిల్ గా ఈ సమాచారం ఇచ్చిన సానియా.. షోలో మరెన్ని ఆసక్తికర అంశాలు చెబుతారో?