Begin typing your search above and press return to search.

బాహుబ‌లికి ధీటుగా ప‌ద్మావ‌తి ఉంటుందా?

By:  Tupaki Desk   |   4 Nov 2016 5:30 AM GMT
బాహుబ‌లికి ధీటుగా ప‌ద్మావ‌తి ఉంటుందా?
X
భార‌తీయ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో బాహుబ‌లి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్ప‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి ఉండ‌దు. భారీ త‌నానికి హాలీవుడ్ చిత్రాలు మాత్ర‌మే చూడాలి అనే అభిప్రాయాన్ని స‌మూలంగా మార్చేసిన చిత్రం ఇది. భార‌తీయ సినిమా కూడా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌దు అని నిరూపించింది. అయితే, బాహుబ‌లిని మించిన స్థాయిలో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ! రొమాంటిక్ ల‌వ్ స్టోరీని అత్యంత భారీగా తెర‌కెక్కించ‌డంలో సిద్ధ‌హ‌స్తుడు భ‌న్సాలీ. గ‌త చిత్రం ‘బాజీరావ్ మ‌స్తానీ’ దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఎన్నో అవార్డులూ రివార్డు కూడా అందుకుంది. అయితే, ఈ చిత్రంలో భారీ వార్ సీక్వెన్సులు లాంటివి లేవు. ఆ క‌థ వేరు.

బాజీరావ్ మ‌స్తానీ త‌రువాత అంత‌కంటే మ‌రో భారీ చిత్రం ‘రాణి ప‌ద్మావ‌తి’ని ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. ఈ చిత్రం కూడా సున్నిత‌మైన ప్రేమ‌క‌థాంశం చుట్టూ అల్లుకున్నదే అని తెలుస్తోంది. అయితే, ఇందులో భారీ యుద్ధ స‌న్నివేశాలు కూడా ఉండ‌బోతున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ వార్ సీక్వెన్సులు బాహుబ‌లి కంటే భారీగా ఉండేలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్నాడు అని ముంబై చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. వార్ సన్నివేశాల్లో భారీత‌నం అంటే - ప్ర‌స్తుతానికి బాహుబ‌లి చిత్రం మాత్ర‌మే ఒక ల్యాండ్ మార్క్‌. దాన్ని మించిన స్థాయిలో వార్ ఎపిసోడ్‌ లు తెర‌మీదికి వ‌స్తాయంటే... ప్రేక్ష‌కుల‌కు అంత‌మించిన న‌య‌నానంద‌క‌రం ఏముంటుంది చెప్పండి...? మొత్తానికి భ‌న్సాలీ ప‌ద్మావ‌తిపై ఇప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాజీరావ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ కూడా మాంచి ఫామ్‌ లో ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/