Begin typing your search above and press return to search.

ఇంత‌కీ బాలీవుడ్ హీరోయిజం ఖ‌త‌మ్ అనేశాడా?

By:  Tupaki Desk   |   16 April 2022 4:15 AM GMT
ఇంత‌కీ బాలీవుడ్ హీరోయిజం ఖ‌త‌మ్ అనేశాడా?
X
హాని చేయ‌ని కొన్నిటిని బాహాటంగా మాట్లాడాలి. చాలా విష‌యాల్ని చెవిలోనే చెప్పాలి...! అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కానీ ఆ రూల్ ని బ్రేక్ చేశారు సంజ‌య్ ద‌త్. ఒక ర‌కంగా సౌత్ వ‌ర్సెస్ నార్త్ అనే తేనె తుట్ట‌ను క‌దిపార‌ని చెప్పాలి. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారు? అంటే..''బాలీవుడ్‌లో హీరోయిజం మిస్సయింది'' అని సంజయ్ దత్ అనేశారు.

నిజానికి హీరో నడిచేటప్పుడు ఈలలు చప్పట్లు ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఇక సంజూ భాయ్ కేజీఎఫ్ 2లో అధీరాగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అత‌డి పాత్ర‌కు అంత‌గా ఎలివేష‌న్ లేద‌ని ప‌ర్ప‌స్ లేద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కానీ కొన్ని సెక్ష‌న్ల నుంచి ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. తాజా ఇంట‌ర్వ్యూలో సంజ‌య్ ద‌త్ ర‌క‌ర‌కాల విషయాలపై తన ఆలోచనలను తెలిపాడు. ఈ మాట‌ల్లోనే హీరోయిజం అంటే ఏమిటో చెప్పేశాడు.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిజాన్ని ఎప్పటికీ మరచిపోలేదు. వీరత్వం ఎప్పుడూ ఉంటుంది... అది ముఖ్యమని నేను భావిస్తున్నాను... మనం (బాలీవుడ్ జ‌నం) దానిని కొంచెం మరచిపోయామని నేను భావిస్తున్నాను... హీరో ప్రవేశం మనసుకు హత్తుకునేలా ఉండాలి. ఆ హీరోయిజం మ‌న‌కు ఇన్నాళ్లు కనిపించకుండా పోయింది...అని వ్యాఖ్యానించారు. అది ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంద‌ని కూడా ప్ర‌శంసించారు. ఇంకా చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుతూ.. హీరో లేదా విలన్ ఎంట్రీ అయినా సరే ఈలలు మరియు చప్పట్లు ఉండాలి…అమ్రిష్ జీ ఇతర నటీనటులందరినీ చూడండి. వారు ఇంత‌ గొప్పగా పని చేసారు.

వారు బలమైన విలన్లు. బలమైన విలన్ లేకుండా హీరో బలంగా ఉండలేడు... హాలీవుడ్ చిత్రాలలో కూడా ఇదే క‌నిపిస్తుంది! అని అన్నారు. అది యాక్షన్.. థ్రిల్లర్ లేదా సూపర్ హీరో సినిమా ఏదైనా కానీ విలనీ చాలా కీల‌క‌మ‌ని అన్నారు. థానోస్ కు ప్రపంచాన్ని నిమిషాల వ్యవధిలో ముగించే శక్తి ఉంది. థానోస్ లేకపోతే ప్రతీకారం తీర్చుకునే వారు హీరోలు ఎలా అవుతారు? అని కూడా అన్నారు. అధీరా పాత్ర‌కు మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్తం కాగా రాకింగ్ స్టార్ య‌ష్ మ‌రోసారి మాఫియా డాన్ గా అద‌ర‌గొట్టాడ‌ని హీరో ఎలివేష‌న్ సీన్స్ ని ప్ర‌శాంత్ నీల్ ప‌రాకాష్ట‌లో చూపించార‌ని కూడా ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

అదంతా స‌రే కానీ 'అధీరా' తేనె తుట్ట‌నే క‌దిపారు. నిజానికి ఖాన్ లు న‌టిస్తున్న సినిమాల్లో హీరోల ఎలివేష‌న్ కి ఏం త‌క్కువ‌ని. కానీ ఆ హీరోల మొహాలు చూడ‌డానికి అభిమానుల‌కు బోర్ కొట్టిందేమో! అన్న విమ‌ర్శ ఇటీవ‌ల వినిపిస్తోంది. ద‌త్ నిజాన్ని చెప్పినా కానీ దానిని అంగీక‌రించేందుకు బాలీవుడ్ హీరోలు సిద్ధంగా ఉన్నారా? అన్న‌ది కూడా కాస్త వేచి చూడాలి. అయినా సౌత్ నుంచి యంగ్ ట్యాలెంటెడ్ హీరోలు దూసుకొస్తుంటే 50 ప్ల‌స్ హీరోల్ని ఎన్నాళ్లు భ‌రిస్తారు? అని కూడా ఒక సెక్ష‌న్ లో గుస‌గుస ఉంది.

ఇక జాన్ అబ్ర‌హాం లాంటి హీరోలు సౌత్ సినిమాని చిన్న చూపు చూడ‌డం వింత‌గా ఉంది అంటూ ఎగ‌తాళి చేసేవాళ్లు లేక‌పోలేదు. చింత చ‌చ్చినా బాలీవుడ్ హీరోల పులుపు చావాలేదేమిటో పాపం! అంటూ కొంద‌రు కామెంట్లు చేయ‌డం సామాజిక మాధ్య‌మాల్లో స్ప‌ష్ఠ‌మ‌వుతోంది. బాహుబ‌లి- సాహో - కేజీఎఫ్ 1 - పుష్ప‌- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 బాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు సినారియో అంతా మారింది. తెలుగు సినిమానే భార‌తీయ సినిమా అనేంత‌గా ఎదిగింది. ఆ కోణంలో హిందీ క్రిటిక్స్ సైతం ప్ర‌శంసిస్తూ విశ్లేష‌ణ‌లు సాగిస్తున్నారు.