Begin typing your search above and press return to search.

చేతల్లో గొప్ప.. మాటలు నిల్

By:  Tupaki Desk   |   19 Dec 2018 10:58 AM GMT
చేతల్లో గొప్ప.. మాటలు నిల్
X
చాలామంది మాటలు కోటలు దాటిపోతుంటాయి. చేతలు అందుకు తగ్గట్లు ఉండవు. చెత్త చెత్త సినిమాలు తీసి కూడా వాటి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక సినిమా బాగా ఆడితే.. మంచి గుర్తింపు వస్తే రెచ్చిపోయి మాట్లాడేస్తుంటారు. తమ సినిమాల ఆడియో వేడుకల్లో దర్శకులు ఎలా డబ్బా కొట్టుకుంటారో చూస్తూనే ఉంటాం. పేరున్న దర్శకులు సైతం అతిగా మాట్లాడేస్తుంటారు. కానీ కొందరు మాత్రం చాలా సైలెంటుగా ఉంటారు. తాము కాదు మాట్లాడాల్సింది తమ సినిమా అని భావిస్తారు. అలాగే కొందరు బిడియస్తులుగా ఉంటారు. మంచి మంచి సినిమాలు తీస్తారు కానీ.. స్టేజ్ ఎక్కి మాట్లాడటానికి మాత్రం కంగారు పడిపోతుంటారు. ‘ఘాజీ’తో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ ఈ కోవకు చెందిన దర్శకుడిలాగే కనిపిస్తున్నాడు. అతడి సింప్లిసిటీ చూసి అందరూ షాకైపోతున్నారు.

రామ్ చరణ్ అన్నట్లుగా అతడి కటౌట్ కి.. అతడి విజన్ కి సంబంధమే లేదసలు. తొలి ప్రయత్నంలోనే ‘ఘాజీ’ లాంటి గొప్ప సినిమా తీసిన సంకల్ప్.. ఎక్కడా అతిగా మాట్లాడింది లేదు. అసలతను మాట్లాడటమే గగనం అయింది. అతడిని చూస్తే ఆ స్థాయి సినిమా తీశాడని ఎవ్వరూ అనుకోరు. ఇక రెండో ప్రయత్నంలో ‘అంతరిక్షం’ లాంటి మరో సాహసోపేత ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నాడు. దీని టీజర్.. ట్రైలర్ చూస్తే మరో సెన్సేషన్ ఖాయం అనిపించింది. నిన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో ఓవైపు క్రిష్.. మరోవైపు చరణ్.. సంకల్ప్ ను తెగ పొగిడేశారు. అతడిని చూస్తే గర్వంగా ఉందన్నారు. కానీ సంకల్ప్ మాత్రం అలా పొగుడుతున్నపుడు కూడా ఏమీ స్పందించకుండా కామ్ గా ఉండిపోయాడు. అంతకుముందు మైక్ ఇచ్చి మాట్లాడమంటే.. నిమిషం కూడా స్టేజ్ మీద నిలవలేదు. తాను తీసిన సినిమా గురించి తానేం మాట్లాడతానన్నాడు. సినిమానే మాట్లాడుతుందన్నాడు. తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని.. వెంటనే సినిమా చూపించేయాలనుందని.. సినిమా చూసి జనాలే మాట్లాడాలని అనేసి నిష్క్రమించాడు. మొత్తానికి చేతలతోనే తన గొప్పదనాన్ని చాటుతున్న సంకల్ప్.. మాటల్లో మాత్రం చాలా వీక్ అని ఈ వేడుకతో మరోసారి రుజువైంది.