Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలకు రాసిచ్చేశారు కానీ..

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:15 PM GMT
సంక్రాంతి సినిమాలకు రాసిచ్చేశారు కానీ..
X
తెలుగులో చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేమీ లేకుండా ఒక వీకెండ్ గడిచిపోవడం అరుదే. ఎలాంటి సీజన్ అయినా సరే.. ప్రతి వీకెండ్లోనూ కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఐతే గత కొన్నేళ్లు సంక్రాంతి సీజన్లో విపరీతమైన పోటీ ఉంటుండటం.. భారీ సినిమాలు రిలీజవుతుండటంతో వాటి కోసం తర్వాతి వారాన్ని కూడా వదిలేస్తున్నారు. చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేవీ రిలీజ్ చేయట్లేదు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయం కొనసాగనుంది. వచ్చే వారంలో కాస్త పేరున్న సినిమా ఏదీ రిలీజ్ కావట్లేదు. ఇది సంక్రాంతి సినిమాలకు అదనపు సానుకూలతే. మరి ఈ సానుకూలతను ఈ సినిమాలు ఎలా వాడుకుంటాయో చూడాలి.

‘అజ్ఞాతవాసి’ విషయానికి వస్తే.. ఆ చిత్రం రెండో రోజుకే దబేల్ మని పడింది. వసూళ్లలో 80 శాతం డ్రాప్ కనిపించింది. వీకెండ్లోనే ఆ సినిమా పెద్దగా పుంజుకున్నది లేదు. సంక్రాంతి రోజు కూడా పరిస్థితి మెరుగవ్వలేదు. ‘జై సింహా’ పరిస్థితి పర్వాలేదు. టాక్ ఏమంత గొప్పగా లేకున్నా వసూళ్లు బాగున్నాయి. సంక్రాంతి రేసులో చివరగా వచ్చిన ‘రంగుల రాట్నం’ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సూర్య సినిమా ‘గ్యాంగ్’ పరిస్థితి పర్వాలేదన్నట్లుగా నడుస్తోంది. ఈ చిత్రం కొంచెం లేటుగా పుంజుకుంది. రెండో వారంలో సినిమాలు లేకపోవడం దీనికి బాగానే కలిసి రావచ్చు. ముఖ్యంగా ఎ సెంటర్లలో ఇది మంచి వసూళ్లు రాబట్టే అవకాశముంది. ‘జై సింహా’ మాస్ సెంటర్లలో ఎక్కువ వసూళ్లు తెచ్చుకునే ఛాన్సుంది. ఎటొచ్చీ ‘అజ్ఞాతవాసి’కి మాత్రం దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండేట్లు కనిపించట్లేదు. ‘రంగుల రాట్నం’ అయినా అంతే.