Begin typing your search above and press return to search.

ఈ సంక్రాంతి హిస్టారికల్ బాస్

By:  Tupaki Desk   |   15 Jan 2017 10:29 AM GMT
ఈ సంక్రాంతి హిస్టారికల్ బాస్
X
తెలుగులో వచ్చే సినిమాల్లో నాలుగింట మూడొంతుల సినిమాల మీద మంచి అంచనాలే ఉంటాయి. కానీ అంచనాల్ని సరిగ్గా అందుకునే సినిమాలు నాలుగింట ఒకొంతు కూడా ఉండవు. మనం ఎన్నో అంచనాలు పెట్టుకుని థియేటర్లలోకి వెళ్తాం. తీరా చూస్తే అక్కడ బొమ్మ మరో రకంగా కనిపిస్తుంది. తీవ్ర నిరాశతో బయటికి వస్తాం. ఐతే ఈ సంక్రాంతికి రేసులో నిలిచిన మూడు సినిమాలు మాత్రం కచ్చితంగా ఆడేలాగే కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఆ మూడు సినిమాలూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్తున్నాయి.

చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కి ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ లాంటి హిస్టారికల్ మూవీ ఓపెనింగ్స్ ను కూడా కొన్ని చోట్ల చిరు సినిమా దాటేసిందంటే ఇది ఎలా ఆడుతోందో అర్థం చేసుకోవచ్చు. చిరు సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనుకున్నారు కానీ.. మరీ ఈ స్థాయిలో దుమ్ముదులిపేస్తుందనుకోలేదు. ఇక నందమూరి బాలకృష్ణ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. వసూళ్లకు కూడా ఢోకా లేదు. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయ్యేలా కనిపిస్తోంది శాతకర్ణి.

ఇక సంక్రాంతి రేసులో తర్వాత వచ్చిన శర్వానంద్ సినిమా ‘శతమానం భవతి’కి కూడా మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. రెండు భారీ ప్రాజెక్టుల మధ్య ధీమాగా సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజు నమ్మకం నిలబడింది. పండక్కి పర్ఫెక్టుగా సూటయ్యే సినిమా ఇది. ‘శతమానం భవతి’ అందరికీ ప్రాఫిట్ వెంచర్ అయ్యేలా కనిపిస్తోంది. ఐతే పట్టుబట్టి సంక్రాంతికే విడుదలైన నారాయణమూర్తి సినిమా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ మాత్రం అంచనాలకు తగ్గట్లే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతోంది.