Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్‌: చిరు వ‌ర్సెస్ బాల‌య్య‌..విన్న‌ర్ ఎవ‌రో?

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 PM GMT
సంక్రాంతి ఫైట్‌: చిరు వ‌ర్సెస్ బాల‌య్య‌..విన్న‌ర్ ఎవ‌రో?
X
సంక్రాంతి ఫైట్ చాలా ఏళ్ల తరువాత అగ్ర హీరోల కార‌ణంగా ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతోంది. 2023 సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య సంక్రాంతి వార్ 1987 నుంచే మొద‌లైంది. తొలి సారి `దొంగ‌మొగుడు` తో 1987 జ‌న‌వ‌రి 9న చిరు బ‌రిలోకి దిగితే బాల‌య్య `భార్గ‌వ రాముడు` మూవీతో జ‌న‌వ‌రి 14న పోటీ ప‌డ్డాడు. ఈ రెండు సినిమాల్లో చిరు `దొంగ‌మొగుడు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిస్తే బాల‌య్య `భార్గ‌వ రాముడు` ఎబౌ యావ‌రేజ్ గా నిలిచింది.

అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య సంక్రాంతి స‌మ‌రం సాగుతూనే వుంది. ఒక సారి చిరు పైచేయి సాధిస్తే మ‌రో సారి బాల‌య్య విజయాన్ని అందుకుంటూ వ‌స్తున్నారు. 88లోనూ ఇద్ద‌రు పోటిప‌డితే `మంచి దొంగ‌`తో చిరు పై చేయి సాధించ‌గా బాల‌య్య `ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్`తో ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. 89లో `అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు`తో సంక్రాంతి విజేత‌గా నిలిచాడు చిరు. ఆ ఏడాది బాల‌య్య పోటీప‌డలేదు. ఆ త‌రువాత కూడా ఇద్ద‌రి మ‌ధ్య సంక్రాంతి స‌మ‌రం సాగింది. ఒక‌రు విజ‌యం సాధిస్తే మ‌రొక‌రు ఫ్లాప్ ని చూడ‌టం జ‌రుగుతూ వ‌చ్చింది.

కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చారు. ఆ త‌రువాత వీరిద్ద‌రి మ‌ధ్య సంక్రాంతి వార్ 1997 నుంచి మొద‌లైంది. చిరు `హిట్ల‌ర్‌`తో కొత్త ఇన్నింగ్స్ కి శ్రీ‌కారం చుడితే బాల‌య్య `పెద్ద‌న్న‌య్య‌`తో వ‌చ్చాడు. ఇద్ద‌రూ విజ‌యం సాధించారు. 1999లో బాల‌కృష్ణ `స‌మ‌ర‌సింహారెడ్డి`తో బ‌రిలో కి దిగితే చిరు `స్నేహం కోసం`తో పోటీప‌డ్డాడు. ఈ రెండు సినిమాల్లో బాల‌కృష్ణ `స‌మ‌ర‌సింహారెడ్డి`ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచి పై చేయి సాధించింది. చిరు మాత్రం `స్నేహం కోసం`తో డీసెంట్ హిట్ ని మాత్ర‌మే ద‌క్కించుకున్నాడు. `స‌మ‌ర‌సింహారెడ్డి` సీమ ఫ్యాక్ష‌న్ సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించి ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు ఆజ్యం పోసింది.

2000లో చిరు `అన్న‌య్య‌`తో రాగా.. బాల‌య్య `వంశోద్దార‌కుడు`తో వ‌చ్చాడు. 2001లో చిరు `మృగ‌రాజు`తో వ‌స్తే బాల‌య్య `న‌రసింహానాయుడు`తో వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకున్నాడు. చిరు డిజాస్ట‌ర్ ని ఎదుర్కొన్నాడు. 2004లో చిరు `అంజి`తో వ‌స్తే బాల‌య్య `ల‌క్ష్మీ న‌ర‌సింహా`తో విజ‌యం సాధించాడు . ఆ త‌రువాత మ‌ళ్లీ ఇద్ద‌రు పోటీప‌డ‌లేదు. `శంక‌ర్ దాదా జిందాబాద్‌` త‌రువాత చిరు ప‌దేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా వున్నారు. 2017లో `ఖైదీ నంబ‌ర్‌ 150`తో రీఎంట్రీ ఇచ్చారు.

ఇది జ‌న‌వ‌రి 11న విడుద‌ల కాగా అదే సంక్రాంతికి బాల‌య్య జ‌న‌వ‌రి 12న `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి`తో పోటీకి దిగాడు. రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి` బాల‌య్య న‌టించిన 100వ చిత్రం కావ‌డంతో ఈ మూవీ బాల‌య్య అభిమానుల్ని ఓ రేంజ్ లో అల‌రించింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత 2023 సంక్రాంతి బ‌రిలో బాల‌య్య‌, చిరు సై అంటే సై అంటూ కాలుదువ్వుతున్నారు. చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`తో జ‌న‌వ‌రి 13న వ‌స్తుండ‌గా, బాల‌కృష్ణ జ‌న‌వ‌రి 12న `వీర‌సింహారెడ్డి`తో బ‌రిలో దిగుతున్నాడు.

దాదాపు ఆరేళ్ల విరామం త‌రువాత సంక్రాంతి స‌మ‌రానికి పోటి ప‌డుతున్న ఈ ఇద్ద‌రు అగ్రహీరోల్లో ఎవ‌రు పైచేయి సాధిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంక్రాంతి స‌మ‌రంలో చిరు పై చేయి సాధిస్తారా? లేక బాల‌కృష్ణ విజ‌యాన్ని ద‌క్కించుకుంటారా? అన్న‌ది తెలియాలంటే 2023 జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.