Begin typing your search above and press return to search.

సంక్రాంతి నేర్పిన గుణపాఠం

By:  Tupaki Desk   |   24 Jan 2019 1:30 AM GMT
సంక్రాంతి నేర్పిన గుణపాఠం
X
ఎప్పటిలాగే సంక్రాంతి సందడి సందడిగా సినిమాలు తీసుకొచ్చింది. ఒకటి కాదు ఏకంగా నాలుగు. దేనికవే ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్ లో వచ్చినవి. విడుదలకు ముందు వరకు అన్ని భీభత్సమైన హైప్ తో ఉన్నాయి. కాస్తో కూస్తో ఎఫ్2 మీదే సందేహాలు ఉండేవి. అయితే 12వ తేది నాటికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎఫ్2 బంపర్ విన్నర్ గా నిలవగా వినయ విధేయ రామ - ఎన్టీఆర్ కథానాయకుడుకి ఘోర పరాభవం తప్పలేదు. ఒకటి 30 కోట్లు మరొకటి 50 కోట్లకు బయ్యర్లను నిండా ముంచేశాయి.

మరోవైపు అండర్ డాగ్ గా వచ్చిన ఎఫ్2 ఏకంగా 60 కోట్ల షేర్ దాటి 75ని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు సంక్రాంతి నేర్పిన పాఠం ఏంటి అని దర్శక నిర్మాతలు మరోసారి విశ్లేషించుకోవాలి. ఆర్భాటాలకు - కాంబినేషన్లకు - క్రేజ్ లకు కలెక్షన్లు వచ్చే రోజులు కావివి. ఒకప్పుడు చిరంజీవి లాంటి హీరోల ప్లాప్ సినిమాలు కూడా వంద రోజులు ఆడేవి. నష్టాలు అంతగా ఉండేవి కావు.

కానీ ఇప్పుడంత సీన్ లేదు. ఓపెనింగ్స్ ని పరమావధిగా పెట్టుకుని వందల కోట్లతో జూదం ఆడుతున్నారు. వస్తే అంతకంతా రెట్టింపు లాభం. పోతే దివాళా తీసేంత నష్టం. విచ్చలవిడిగా సినిమాలు కొనకూడదని డిస్ట్రిబ్యూటర్లకు గతం ఎన్ని గుణపాఠాలు నేర్పిస్తున్నా ఎలాంటి మార్పు రావడం లేదు. అజ్ఞాతవాసి - స్పైడర్ - బ్రహ్మోత్సవం - సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.

పైగా గత సినిమా యాభై కోట్లకు పాడుకున్నాం కాబట్టి ఈ సారి డెబ్భై కోట్లకు కొనాలి అనేలా ఎగబడుతున్న తీరు ఆఖరికి ప్రేక్షకుల జేబులకు కూడా చిల్లులు పెడుతోంది. ప్రత్యేక అనుమతుల పేరిట టికెట్ రేట్లను పెంచేసుకుని మొదటి వారం ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. అంత ఖర్చు పెట్టినా మంచి సినిమా చూశామన్న ఆనందం ప్రేక్షకులకు మిగలడం లేదు. ఇకనైనా కాస్త కంటెంట్ మీద ఫోకస్ పెట్టి మంచి సినిమాలు ఎలా తీయాలి అనే కోణంలో ఆలోచిస్తే టాలీవుడ్ సక్సెస్ శాతం పెరుగుతుంది. లేదంటే హిస్టరీ రిపీట్ అవ్వడం తప్ప ఒరిగేది ఏమి ఉండదు