Begin typing your search above and press return to search.

సప్తగిరికి కథలపై నమ్మకం లేదా?

By:  Tupaki Desk   |   8 Dec 2017 11:30 PM GMT
సప్తగిరికి కథలపై నమ్మకం లేదా?
X
మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు సైతం కమర్షియల్ హంగుల గురించి పెద్దగా ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. డ్యాన్సులు.. ఫైట్ల విషయంలో మోజు తగ్గించుకుని కథా బలమున్న సినిమాల్లో నటించడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ కమెడియన్ల నుంచి హీరోలుగా మారుతున్న నటులు మాత్రం ఈ అదనపు ఆకర్షణల మీద తెగ మోజు పడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. సునీల్ వరుసగా ఇలాంటి ప్రయత్నాలే చేసి చేసి.. తన మార్కెట్ ను బాగా దెబ్బ తీసుకున్నాడు. ఇప్పుడు హీరోగా కొనసాగలేక.. తిరిగి కామెడీ చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక అయోమయంలో ఉన్నాడు సునీల్.

కళ్ల ముందు సునీల్ పెద్ద ఉదాహరణగా కనిపిస్తున్నప్పటికీ సప్తగిరి సైతం అదే తప్పు చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. తన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లో సప్తగిరి ఓ లెవెల్లో హీరోయిజం చూపించాడు. డ్యాన్సులు చేశాడు. ఫైట్లు చేశాడు. ఇంకా ఏవేవో విన్యాసాలు చేశాడు. ఐతే అది మామూలు కథే కాబట్టి.. ఆ కథలో అంత బలం కూడా లేదు కాబట్టి సరిపోయింది. కానీ హిందీ నుంచి ‘జాలీ ఎల్‌ ఎల్ బీ’ లాంటి మంచి కథను తీసుకొచ్చి దాన్ని కూడా తొలి సినిమా మాదిరే డీల్ చేయడమేంటో అర్థం కావడం లేదు. కథలో అంత బలమున్నా.. చాలా విషయమున్నా దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయలేదు. బహుశా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’కు ఓపెనింగ్స్ బాగా వచ్చి నిర్మాత సేఫ్ కావడానికి తాను చేసిన ఫైట్లు.. డ్యాన్సులే కారణమని సప్తగిరి భావించాడో ఏమో? మళ్లీ ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ విషయంలోనూ అదే ప్రయత్నం చేశాడు.

కానీ ఇందులో అతడి ఫైట్లు.. డ్యాన్సులు.. హీరోయిజం ఎలివేషన్ సీన్లు ఏమాత్రం సెట్టవ్వలేదు. కాకపోతే కమెడియన్ గా కూడా సప్తగిరికి బి-సి సెంటర్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు హీరోగా కూడా వాళ్లనే అతను టార్గెట్ చేస్తున్నట్లున్నాడు. అందుకే ఆ హంగుల్ని అతను వదులుకోవట్లేదు. ఐతే ఈ చిత్రానికి ఫుల్ రన్లో ఎలాంటి వసూళ్లు వస్తాయన్నదాన్ని బట్టి హీరోగా అతడి గమనం ఉండబోతోంది. ప్రస్తుతానికైతే సప్తగిరికి కథల కంటే తన విన్యాసాల మీదే నమ్మకం ఉన్నట్లుగా కనిపిస్తోంది.