Begin typing your search above and press return to search.

కామెడీ సినిమా నేర్పిన సీరియస్ పాఠం

By:  Tupaki Desk   |   16 Jun 2019 6:21 AM GMT
కామెడీ సినిమా నేర్పిన సీరియస్ పాఠం
X
సినిమాల గురించి హీరోలు దర్శకులు ప్రమోషన్ లో ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఫైనల్ గా ప్రేక్షకుడు ఇచ్చే తీర్పే బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని శాశిస్తుంది. ఇది సత్యం. కేవలం హంగులు ఆర్భాటాల మీద వసూళ్లు వచ్చే కాలం కాదిది. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం కమెడియన్ సప్తగిరి హీరోగా చేసిన వజ్రకవచధరి గోవిందా సినిమా ఫలితం. కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేక రివ్యూలతో మొదలుకుని పబ్లిక్ టాక్ దాకా యునానిమస్ గా నెగటివ్ టాక్ తెచ్చుకోవడం చూస్తే దీని కన్నా సప్తగిరి ఎక్స్ ప్రెస్ వందల రెట్లు మెరుగైన సినిమాగా అనిపించడం సహజం.

వాస్తవానికి అది ఓ మోస్తరుగా సక్సెస్ కావడమే ఈ హాస్య నటుడిలో ఓవర్ కాన్ఫిడెన్సుని పెంచినట్టుంది. తన బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం సూట్ కాని హీరోయిజంతో స్టార్లే వదిలేసిన పాత మూస మసాలా ఫార్ములాలో తనను చూపించుకునే ప్రయత్నం చేయడం చూసి జనం నిర్మొహమాటంగా తిరస్కరించేశారు. ఇప్పుడు సప్తగిరి ఖచ్చితంగా స్వీయ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం పడింది

కమెడియన్లు హీరోలు కావడం ఎప్పటినుంచో ఉన్నదే. రాజబాబు తిరుపతి సినిమా తీసి హిట్టు కొట్టారు. ఆలికి యమలీల లాంటి బ్లాక్ బస్టర్ ఉంది. సునీల్ లో హీరో ఉన్నాడని చెప్పింది అందాల రాముడు. బ్రహ్మానందం గారికి సరసాల సోగ్గాడు-జోకర్ మామ సూపర్ అల్లుడు లాంటి కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. బాబూమోహన్ సుందరవదనా సుబ్బలక్ష్మిమొగుడాతో బిసి సెంటర్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. కాని వీళ్ళెవరూ లాంగ్ రన్ హీరోలుగా కెరీర్ ప్లాన్ చేసుకోలేదు.

కొన్ని సినిమాలు చేసేసి జనం ఇక చూడరు అని త్వరగా తెలుసుకుని తమ హాస్య పాత్రలకు వెనక్కు వెళ్ళిపోయి బ్రహ్మాండంగా వందల సినిమాలు చేసుకున్నారు. అసలే టాలీవుడ్ లో కమెడియన్ల కొరత ఉంది. సప్తగిరి లాంటి మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు ఇలా హీరో వేషాల వ్యామోహంలో పడితే ఇటు ఇవి ఆడక ఇక హీరో అయ్యాడు కదా అని దర్శకులు వీళ్ళ కోసం ట్రాకులు రాయడం మానేస్తే చివరికి రెంటికి చెడ్డ రేవడిలా మిగలడం ఖాయం. అందుకే సునీల్ లా ఆలస్యంగా మేల్కొనకుండా త్వరగా అలెర్ట్ అయితే సప్తగిరికి మంచి భవిష్యత్తు ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.