Begin typing your search above and press return to search.

హీరో వేషాల మాయలో కమెడియన్

By:  Tupaki Desk   |   4 Aug 2019 7:05 AM GMT
హీరో వేషాల మాయలో కమెడియన్
X
కమెడియన్లు హీరోలు కావొచ్చు కాని పెర్మనెంట్ గా అలాగే సెటిల్ కావడం జరగని పనని టాలీవుడ్ చరిత్ర ఎన్నో సార్లు ఋజువు చేసింది. అందుకే వెయ్యి సినిమాలు చేసిన బ్రహ్మానందం ఆ మార్క్ కు దగ్గరలో ఉన్న ఆలీ లాంటి వాళ్ళు వీలైనంత త్వరగా ఇమేజ్ చట్రం నుంచి బయటికి వచ్చి రెగ్యులర్ హాస్య పాత్రలు ధరించి వాటినే తమ నటనతో నిలబెట్టి కెరీర్ ని పటిష్టం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పొతే లిస్టు చాలా పెద్దదే ఉంది. కానీ కొందరు మాత్రం ఈ సత్యాన్ని గుర్తించలేక వస్తున్న ఆఫర్స్ ని వదులుకుని హీరోగానే చేయాలనీ డిసైడ్ కావడం వాళ్ళను అభిమానించే వాళ్ళను ఇబ్బంది పెడుతోంది.

ఇప్పుడీ చర్చ రావడానికి కారణం సప్తగిరి. మంచి టైమింగ్ తో ఎవరికి అంత ఈజీగా రాని డిఫరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకునే సప్తగిరి ప్రస్తుతం హీరోగా తన భేతాళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఓ మాదిరిగా పాస్ అయినా సప్తగిరి ఎల్ ఎల్ బి ఆశించిన ఫలితం అందుకోలేదు. ఇక ఇటీవలే వచ్చిన వజ్రకవచధారి గోవిందా గురించి చెప్పాల్సిన పని లేదు. వారం ఆడటమే పెద్ద కష్టమై పోయింది .ఇప్పుడు తాజాగా రివాల్వర్ రాజా అనే మరో సినిమా చేస్తున్నాడు. ప్రేక్షకులు ప్రత్యేకించి సప్తగిరిని ఇలాగే చూడాలని అనుకోవడం లేదు. మంచి సపోర్టింగ్ రోల్స్ తో తమను నవ్వించేలా చేయాలని కోరుతున్నారు.

కానీ ఇతను మాత్రం హీరోగా వచ్చే అవకాశాలనే పరిగణనలోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలు ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు కానీ వాళ్ళ పెట్టుబడికి ఎంత వరకు గ్యారెంటీ అనేది సినిమా హిట్ అయితే కానీ చెప్పలేం. మినిమమ్ ఓపెనింగ్స్ కరువవుతున్న సప్తగిరి సినిమాలు ఏదో అద్భుతం చేస్తే తప్ప హిట్ అనిపించుకునే పరిస్థితి లేదు. ఇకనైనా తనకు పేరు తెచ్చిన క్యారెక్టర్స్ వైపు దృష్టి పెడితే అసలే కమెడియన్ల కొరత తో ఉన్న టాలీవుడ్ కు చాలా ఏళ్ళ పాటు ఓ నటుడు అందుబాటులో ఉండొచ్చు. లేదూ నేను హీరోగానే చేస్తాను అంటే ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు దీనికి బ్రేక్ పడటం ఖాయం