Begin typing your search above and press return to search.

ఆ స్టూడియో షాపింగ్ మాల్ అవుతుందా?

By:  Tupaki Desk   |   14 Oct 2016 11:48 AM GMT
ఆ స్టూడియో షాపింగ్ మాల్ అవుతుందా?
X
దేశంలో ఎక్కడా లేనన్ని సినిమా థియేటర్స్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి. కానీ కాలంతో పాటే థియేటర్స్ కనుమరుగైపోయాయ్. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్.. ఫంక్షన్ హాల్స్ గా కనిపిస్తున్నవన్నీ ఒకప్పుడు పేరొందిన సినిమా థియేటర్సే. నిర్వహణ కష్టంగా మారడమో.. సరైన ఆదరణ దక్కకపోవడమో లేకపోతే కాలంతో పాటే మారి వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనే కానీ ఇప్పుడు ఫేమస్ స్టూడియోస్ కూడా షాపింగ్ మాల్స్ గా మారడానికి ప్రిపేర్ అవుతున్నాయ్.

అవును.. తెలుగు చలనచిత్ర రంగం.. ఆ మాటకొస్తే.. కొన్ని వందలు.. వేల చిత్రాల షూటింగ్ లకి కేరాఫ్ గా మారి భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్లేస్ సంపాదించుకొన్న సారథి స్టూడియోస్ త్వరలో షాపింగ్ కాంప్లెక్స్ గా మారబోతుంది. సారథికి చెందిన ఆఫీస్.. మూడు ఇండోర్ షూటింగ్ ఫ్లోర్స్ ని అలాగే ఉంచేసి.. స్టూడియో పరిసరాల్లో ఉన్న ఓపెన్ ఏరియాలో కమర్షియల్ మాల్ తో పాటు మల్టీప్లెక్స్.. హోటల్ ని నిర్మించనున్నారు. మొత్తం 97 వేల 442 స్క్వేర్ మీటర్స్ లో 250 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలకి ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లు కావాలంటూ తెలంగాణా రాష్ట్ర పర్యావరణ శాఖకి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట అప్లికేషన్ కూడా దాఖలైంది. ఆ మధ్య రెన్యూవేషన్ చేసి సారథి స్టూడియోని మళ్లీ అందుబాటులోకి తెస్తారని వినిపించింది. మినీ థియేటర్స్ ను నిర్మిస్తారనే ప్రచారమూ జరిగింది. మరి ఏమైందో ఏమో ఇప్పుడు స్టూడియోని షాపింగ్ మాల్ చేస్తామంటున్నారు.

మొత్తంగా కాకపోయినా సగం స్టూడియో షాపింగ్ మాల్ గా మారిపోతుందనే సరికి సారధితో అనుబంధం ఉన్నవారంతా అదో రకమైన ఫీలింగ్ లో ఉండిపోయారు. అంతేకాదు ఒక్కసారి మాల్ నిర్మాణం పూర్తై అందుబాటులోకి వస్తే ఇక సారథిలో గతంలోలా షూటింగ్ ల కళ ఉండదనే వాస్తవం సినీ లవర్స్ కి మింగుడు పడట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/