Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఇంటి నుంచి మధ్యలో బయటకు పంపేశారు!

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:49 AM GMT
బిగ్ బాస్ ఇంటి నుంచి మధ్యలో బయటకు పంపేశారు!
X
తమిళ బిగ్ బాస్ రియాల్టీ షోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడకమానదన్న మాటకు తగ్గట్లే.. తాజాగా దర్శకుడు శరవణన్ కు భారీ శిక్ష పడింది. ఆడవాళ్లను చులకన చేస్తే ఏదో ఒక రోజు అది వెంటాడి.. వేధిస్తుందన్న మాట నిజమని తాజా ఉదంతంతో తేలింది. బిగ్ బాస్ హౌస్ నుంచి అర్థాంతరంగా ఆయన్ను బయటకు పంపుతూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకా నిర్ణయం తీసుకున్నారన్నది చూస్తే..

తమిళ బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లలో తమిళ దర్శకుడు శరవణన్ ఒకరు. ఒక టాస్క్ లో భాగంగా తనతో చేరన్ (శరవణన్ కాదు) అసభ్యంగా ప్రవర్తించినట్లుగా నటి మీరా మిథున్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. నటిపై ప్రయోక్తగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేసి చేరన్ ను సమర్థించారు. ఈ వ్యవహారం ఇక్కడితో ముగిస్తే కథ మరోలా ఉండేది.

హౌస్ లో అసభ్యంగా ప్రవర్తించారన్న నటి మాటల నేపథ్యంలో హౌస్ లో ఉన్న అబ్బాయిలు తమ జీవితంలో ఎవరైనా పాల్పడ్డారా? అని బిగ్ బాస్ ప్రశ్నించారు. దీనికి స్పందించిన దర్శకుడు శరవణన్.. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణిస్తూ అమ్మాయిల్ని టచ్ చేసేవాడినని చెప్పారు. సరదాగా తన గతాన్ని గుర్తు చేసుకున్న దర్శకుడి మాటల్ని బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటు.. ప్రయోక్తగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ సైతం లైట్ గా తీసుకొని నవ్వేశారు.

ఈ ఎపిసోడ్ తర్వాత.. దర్శకుడు శరవణన్ మాటలపై సోషల్ మీడియాలోనూ.. ప్రేక్షకుల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటం మొదలైంది. ఇలాంటి అంశాలపై వెనువెంటనే స్పందించే సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.. శరవణన్ మాటల్ని తీవ్రంగా ఖండించారు. అమ్మాయిల్ని వేధించేందుకు.. టచ్ చేసేందుకే తాను బస్సుల్లో జర్నీ చేసే వాడినంటూ శరవణన్ చెప్పారని..ఇది ప్రేక్షకులకు.. మహిళలకు హాస్యంగా అనిపించిందని..నిజానికి ఆయన మాటలు చాలా హీనంగా ఉన్నాయంటూ ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారం ముదిరిపాకాన పడేసరికి శరవణన్ గతంలో తాను చేసిన పనికి సారీ చెప్పక తప్పలేదు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శరవణన్ సరదాగా చెప్పిన మాటల్లో అతనిపై పెరిగిన నెగిటివ్ ప్రచారంతో ఆయన్ను బిగ్ బాస్ హౌస్ నుంచి అర్థాంతరంగా బయటకు పంపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఎలిమినేషన్ తో సంబంధం లేకుండా పెట్టాబేడా సర్దుకొని శరవణన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో హౌస్ మేట్స్ కు ఏమీ అర్థం కాలేదు. ఇంట్లో వారికి బాగోలేకపోవటం కానీ.. ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లం వల్ల అతను వెళ్లిపోతున్నట్లుగా భావించిన మహిళా కంటెస్టెంట్లు పలువురు కంటతడి పెట్టుకున్నారు. హౌస్ లో ఉన్న వారికి బయట జరుగుతున్నదంతా తెలీదు. తెలిస్తే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో?