Begin typing your search above and press return to search.

అక్కడ సర్దారోడు రికార్డు కొట్టేశాడు

By:  Tupaki Desk   |   9 April 2016 5:14 AM GMT
అక్కడ సర్దారోడు రికార్డు కొట్టేశాడు
X
డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఆల్రెడీ యుఎస్ ప్రిమియర్ షోల కలెక్షన్లలో నాన్-బాహుబలి రికార్డును బద్దలు కొట్టేసిందీ సినిమా. మరోవైపు నైజాం ఏరియాలో ఫస్ట్ డే కలెక్షన్లలోనూ నాన్-బాహుబలి రికార్డు నమోదైంది. అక్కడ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రూ.4.5 కోట్ల దాకా వసూలు చేసినట్లు అంచనా. బాహుబలి రూ.6.25 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఫస్ట్ డే కలెక్షన్లలో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఓవరాల్ గా తొలి రోజు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఎంత కలెక్ట్ చేసిందన్న లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది కానీ.. కొన్ని ఏరియాలకు సంబంధించిన బ్రేకప్స్ మాత్రం బయటికి వస్తున్నాయి.

కాకినాడ టౌన్ లో ‘బాహుబలి’ నెలకొల్పిన రికార్డును సైతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బద్దలు కొట్టేయడం విశేషం. తొలి రోజు ఆ నగరంలో బాహుబలి 92 షోల ద్వారా 31.6 లక్షలు వసూలు చేసింది. రెగ్యులర్ షోల ద్వారా రూ.28.5 లక్షలు వసూలవగా.. బెనిఫిట్ షోల ద్వారా రూ.3.1 లక్షలు కలెక్టయ్యాయి. శ్రీమంతుడు 84 షోల ద్వారా రూ.30.8 లక్షలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు రెగ్యులర్ షోలతో రూ.25.7 లక్షలు.. బెనిఫిట్ షోలతో రూ.5 లక్షలు వసూలయ్యాయి. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మాత్రం బాహుబలి.. శ్రీమంతుడు చిత్రాలతో పోలిస్తే తక్కువ షోలే పడ్డాయి. తొలి రోజు మొత్తం 75 షోలే వేశారు. అయినప్పటికీ రూ.31.8 లక్షలతో బాహుబలి రికార్డును సైతం బద్దలు కొట్టేసింది. రెగ్యులర్ షోలతో రూ.25 లక్షలే వచ్చినప్పటికీ.. బెనిఫిట్ షోల ద్వారా రూ.7 లక్షలు వసూలవడంతో బాహుబలిని దాటేశాడు సర్దార్.