Begin typing your search above and press return to search.

స‌ర్దార్ స‌స్పెన్స్ ఇంకా వీడ‌లేదు

By:  Tupaki Desk   |   6 April 2016 12:17 PM GMT
స‌ర్దార్ స‌స్పెన్స్ ఇంకా వీడ‌లేదు
X
సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు మధ్యలో ఒక్క రోజు మాత్రమే మిగిలుంది. ఆన్ లైన్లో - ఆఫ్ లైన్లో టికెట్లు పెట్టడం ఆలస్యం.. హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లోనూ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఒకటీ అరా షోలకు మాత్రమే.. అది కూడా చాలా తక్కువ టికెట్లు మిగిలి ఉన్నాయి. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘బుక్ మై షో’లో ప్రసాద్ మల్టీప్లెక్స్ - పీవీఆర్ - బిగ్ సినిమాస్ - ఫోరమ్ - ఐనాక్స్ లాంటి ప్రముఖ మల్టీప్లెక్సులు మాత్రం కనిపించట్లేదు. ఈ థియేటర్ల బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మొత్తంగా తెలంగాణ అంతా కూడా ఇదే పరిస్థితి. ఎక్కడా కూడా ఈ మల్టీప్లెక్సుల బుకింగ్స్ ఆన్ లైన్లో కనిపించట్లేదు. ఆ మల్టీప్లెక్సుల దగ్గర కూడా టికెట్లు అమ్మట్లేదు. దీనికి కారణం మల్టీప్లెక్సుల యాజమాన్యాలకు, సర్దార్ నైజాం డిస్ట్రిబ్యూటర్‌ కు మధ్య వివాదమే.

మామూలుగా పెద్ద సినిమాలకు సంబంధించి థియేటర్ల యజమానులు డిస్ట్రిబ్యూటరుకి అడ్వాన్సులు ఇస్తారు. సింగిల్ స్క్రీన్ల విషయంలో ఎప్పట్నుంచో నడుస్తున్న సంప్రదాయమే ఇది. ఐతే మల్టీప్లెక్సులు మాత్రం అడ్వాన్సుల్లాంటివేమీ ఇవ్వవు. కలెక్షన్ల తాలూకు డిస్ట్రిబ్యూటర్ షేర్‌ ను సైతం సినిమా విడుదలైన రెండు మూడు నెలలకు కడతాయి. ఈ పద్ధతి మారాలని డిస్ట్రిబ్యూటర్లు ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమాకున్న క్రేజ్‌ ను దృష్టిలో ఉంచుకుని మల్టీప్లెక్స్ యాజమాన్యాల మెడలు వంచాలని చూస్తున్నాడు. అడ్వాన్స్ ఇవ్వాలని.. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరులు ఎక్కువ కాబట్టి డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ యాజమాన్యాలు ఇందుకు ససేమిరా అంటున్నాయి. ఒకసారి లొంగితే పెద్ద సినిమాలన్నింటికీ ఇదే పద్ధతి మొదలవుతుందని.. భీష్మించుకుని కూర్చున్నాయి. ఇలా ఎవ‌రికి వారు ప‌ట్టుద‌ల‌కు పోవ‌డంతో విడుద‌ల‌కు ఒక్క రోజు మాత్రమే మిగిలున్నా ఇప్ప‌టికీ మ‌ల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ మొద‌లు కాలేదు. ఈ వివాదం ఇంకా ఎక్క‌డిదాకా వెళ్తుందో.. ఎలా ప‌రిష్కార‌మ‌వుతుందో కానీ.. అస‌లు మ‌ల్టీప్లెక్సుల్లో త‌మ హీరో సినిమా రిలీజ‌వుతుందా లేదా అని ప‌వ‌న్ ఫ్యాన్స్ టెన్ష‌న్ ఫీల‌వుతున్నారు.