Begin typing your search above and press return to search.

‘సరైనోడు’ కూడా గుబులు పుట్టిస్తున్నాడు

By:  Tupaki Desk   |   13 April 2016 11:30 AM GMT
‘సరైనోడు’ కూడా గుబులు పుట్టిస్తున్నాడు
X
టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలంటే మినిమం గ్యారెంటీ అని.. వాటి మీద పెట్టుబడి పెట్టడం సేఫ్ అని ఓ అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. కానీ ఈ మధ్య ఆ అభిప్రాయాలు మారిపోతున్నాయి. గత ఏడాది మెగా హీరోల దెబ్బ బయ్యర్లకు గట్టిగానే తగిలింది. ముఖ్యంగా ‘బ్రూస్ లీ’ మూవీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చింది. ‘లోఫర్’ కూడా బాగా చమురు వదలగొట్టింది. సన్నాఫ్ సత్యమూర్తి-సుబ్రమణ్యం ఫర్ సేల్-కంచె సినిమాలు కూడా కొద్ది కొద్దిగా నష్టాలు మిగిల్చాయి. ఇక లేటెస్టుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దెబ్బ అయితే మామూలుగా లేదు. తెలుగులో అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి కాబోతోందని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి రాబోయే కొత్త సినిమా ‘సరైనోడు’ రిజల్ట్ ఎలా ఉంటుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంచి ట్రాక్ రికార్డున్న బోయపాటి శ్రీను దర్శకుడు కావడం.. ఆచితూచి సినిమాలు చేసే అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించడం.. అల్లు అర్జున్ మంచి క్రౌడ్ పుల్లర్ కావడం.. టీజర్ - ట్రైలర్ అన్నీ కూడా మినిమం గ్యారెంటీ మూవీ అన్న ఫీలింగ్ కలిగిస్తుండటంతో సినిమా మీద పాజిటివ్ బజ్ ఉన్న మాట వాస్తవమే. కానీ బ్రూస్ లీ.. సర్దార్ సినిమాల్లాగే దీనికి కూడా మరీ ఎక్కువ రేట్లు పెట్టేశారు బయ్యర్లు. బన్నీ మార్కెట్ స్థాయికి మంచి బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డు రేట్లను టచ్ చేసింది ‘సరైనోడు’. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఏదైనా తేడా వస్తే బయ్యర్లకు బ్యాండ్ మామూలుగా ఉండదు. ఈ రోజుల్లో ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా సరే.. వీకెండ్ అయ్యేసరికి అది పూర్తి నెగెటివ్ టాక్ గా మారిపోతోంది. వీక్ డేస్‌ లో సినిమా నిలవడం కష్టమవుతోంది. కాబట్టి ‘సరైనోడు’కు పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. లేదంటే బయ్యర్లకు ‘సర్దార్’ అనుభవమే తప్పదు.